సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు భారతీయ జనతా పార్టీలో జోష్ పెంచాయి. దీంతో భాగస్వామ్య పార్టీలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కమలనాథులు నిర్ణయించారు. ఇందుకోసం ఈ నెల 21వ తేదీన హస్తినలో భేటీకావాలని నిర్ణయించారు.
ఆదివారం సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీ మరోమారు అధికారంలోకి రాబోతోందంటూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో ఘోషించాయి. దీంతో కమలనాథులు ఉప్పొంగిపోతున్నారు. ఎన్డీయే కూటమిలో జోష్ పెరిగింది.
ఎగ్జిట్ పోల్స్ పూర్తి అనుకూలంగా ఉండడంతో ఫలితాల వెల్లడికి ముందే సమావేశం కావాలని ఎన్డీయే పక్షాలు సమావేశం కావాలని నిర్ణయించాయి. ఈ నెల 21న నిర్వహించనున్న ఈ భేటీకి బీజేపీ, దాని మిత్ర పక్షాలు హాజరై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నాయి.
మరోవైపు, ఈ నెల 22వ తేదీన కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ భాగస్వామ్య పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఈ కూటమికి టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనధికార కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. భేటీ మాత్రం యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ సారథ్యంలోనే చంద్రబాబు ఏర్పాటు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.