ఇక పెట్రో బాదుడే.. బాదుడు… రోజువారికి సమీక్షకు ఓకే

0
51

మార్చిలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత నుంచి నియంత్రణలో ఉన్న ధరలు ఆదివారం సాయంత్రం నుంచి పెరగడం మొదలైంది. ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరల సమీక్ష నిలిపివేసినందున చమురు సంస్థలు భారీగా నష్టాలు మూటగట్టుకున్నట్లు సమాచారం.

ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులపై నిషేధాజ్ఞలు, వెనుజువెలా నుంచీ దిగుమతులు చేసుకోలేని పరిస్థితుల్లో ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగే అవకాశముంది. ఆదివారం 9 పైసలు, 15 పైసల చొప్పున పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలు… సోమవారం మరో 4, 7 పైసల చొప్పున పెరిగాయి.

నిజానికి ఎన్నికల సమయంలో పెట్రో ధరలకు కళ్లెం వేయడం కొత్తేమీ కాదు. గత ఏడాది మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కేంద్రం పెట్రో ధరలను స్థిరంగా ఉంచింది. ఎన్నికలు ముగియగానే.. వరుసగా 15 రోజులపాటు చమురు ధరలు పెరుగుతూ వచ్చాయి.

ఆ తర్వాత 2017 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఇదే పునరావృతమవుతోంది. దేశంలో మొదటి దశ ఎన్నికలకు ముందు అంటే, ఏప్రిల్‌ 10 నాటికి బ్యారెల్‌ ముడిచమురు ధర 70.94 డాలర్లు. అప్పుడు డీజిల్‌ లీటరు రూ.71.27, పెట్రోలు రూ.76.98 వద్ద ఉన్నాయి.

ఆ తర్వాత 22వ తేదీకి ముడిచమురు ధర 73.36కు పెరిగింది. ఆ సమయంలో రూపాయి విలువ కూడా పడిపోయింది. అయినా పెట్రో ధరలను అతిస్వల్పంగా మాత్రమే పెంచారు. డీజిల్‌ ధర రూ.71.64, పెట్రోలు రూ.77.14కు చేరింది. ఇక మే 13వ తేదీ నాటికి క్రూడాయిల్‌ 71.74 డాలర్లకు తగ్గగా, కేంద్రం మాత్రం పెట్రోలు ధరను ఒకేసారి రూ.75.16కు తగ్గించింది.

ఆ తర్వాత చివరి దశ పోలింగ్‌కు రెండు రోజుల ముందు మే 17వ తేదీన క్రూడాయిల్‌ 72.99 డాలర్లకు పెరగ్గా… కేంద్రం చిత్రంగా పెట్రోలు ధరలను తగ్గించింది. డీజిల్‌ ధరలు యథాతథంగా ఉంచింది. చివరికి క్రూడాయిల్‌ పెరిగినా ధరలు తగ్గించడం గమనార్హం.