కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ముసలం చెలరేగింది. సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడైన తర్వాత ఆ పార్టీ సీనియర్ నేత, మైనార్టీ సామాజికవర్గానికి చెందిన రోషన్ బేగ్ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. సీట్ల కేటాయింపు విషయంలో మైనార్టీలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. మంత్రులకు శాఖలను అమ్ముకున్నారని సొంతపార్టీ నేతలపై ఆరోపణలు చేశారు.
రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్ బఫూన్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పొగరుబోతు అంటూ మండిపడ్డారు. ఇక పీసీసీ చీఫ్ గుండురావు ఫ్లాప్ షో కారణంగా ఫలితాలు దారుణంగా రాబోతున్నాయని ఎగ్జిట్‌పోల్స్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రాహుల్ గాంధీని క్షమాపణలు కోరుతున్నానని, క్రిస్టియన్లకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని, ముస్లింలకు ఒకే ఒక్క సీటు కేటాయించారని గుర్తుచేశారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటకలోని జేడీఎస్ కాంగ్రెస్ సర్కారు ఉంటుందో పోతుందోనని ముఖ్యమంత్రి కుమారస్వామి భయపడుతుతన్నారని, ఇక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి తాను ముఖ్యమంత్రిని కాబోతున్నానంటూ సిద్ధరామయ్య చెప్పుకుంటున్నారని రోషన్ పేర్కొన్నారు.
కాగా బేగ్ వ్యాఖ్యలపై డిప్యూటీ సిఎం, కాంగ్రెస్ నేత జి. పరమేశ్వర స్పందించారు. ఇది పూర్తిగా బేగ్ వ్యక్తిగత అభిప్రాయమని, ఆయన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదన్నారు. ఆయన ఆశించిన బెంగళూరు టికెట్ దక్కకపోవడంతో ఈవిధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.