తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్న నటి విజయశాంతి. సినీ ఇండస్ట్రీని వీడి రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినీ రంగం వైపు చూసిన దాఖలాలు లేవు. ఈ మధ్యకాలంలో అలనాటి హీరోయిన్లు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఇటీవల విజయశాంతిని కూడా ఓ కీలక పాత్ర కోసం అడిగారట. అయితే విజయశాంతి అందుకు సానుకూలంగా స్పందించడమే కాకుండా రెమ్యునరేషన్ కోసం ఆమె చేసిన డిమాండ్ వ్యవహారం క్రేజీగా మారింది.
విజయశాంతి హీరోయిన్‌గా ఉన్న సమయంలో ఆమెకు మంచి ఫ్యాన్స్ పాలోయింగ్ ఉంది. ఈ క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. ఆమె నటించిన సినిమాల వసూళ్లు స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉండేవి. స్టార్ హీరోయిన్‌గా రాణించే సమయంలోనే సినిమాలకు బ్రేక్ చెప్పి పాలిటిక్స్‌లో చేరిపోయారు. అప్పటి నుంచి పలు ఆఫర్లు ఆమెను పలకరించినా పెద్దగా స్పందించలేదు.
తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు చిత్రంలో నటించేందుకు ఆమె సమ్మతించింది. “మహర్షి” సినిమా తర్వాత అనిల్ రావిపూడి సినిమాల్లో మహేశ్ నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకోసం ఆమె భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. విజయశాంతి అడిగిన పారితోషికం స్టార్ హీరోలకే జెలసీ పుట్టించేలా ఉందనే టాక్ లేకపోలేదు.
మహేశ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో నటించడం ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. అనిల్ రావిపూడి చెప్పిన కథ నచ్చడంతో ఆ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందు కోసం ఆమె రూ.5 కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేశారు. ఆమెతోనే ఆ పాత్రను చేయించాలని నిర్మాతలు భావించడం వలన.. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఎంతో కొంత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అని సినీ వర్గాలు వెల్లడించాయి.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో విజయశాంతిది 40 సంవత్సరాల సుదీర్ఘమైన కెరీర్. “గ్యాంగ్ లీడర్”, “ఒసే.. రాములమ్మ”, “రౌడీ మొగుడు”, “కర్తవ్యం” లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఆమె చివరిసారిగా 2006లో “నాయుడమ్మ” అనే సినిమాలో కనిపించారు. అప్పటి నుంచి సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు.