జగన్ ఎందుకు గెలిచాడు ?

0
56
YS Jaganmohan Reddy
YS Jaganmohan Reddy

ఉత్కంఠకు తెరపడింది. 42 రోజుల సుదీర్ఘ ఎదురుచూపులు ముగిశాయి. ఏపీలో హోరాహోరీగాసాగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరేసింది. పట్టువదలని విక్రమార్కుడిలా సిఎం పీఠంపై కన్నేసిన జగన్‌ అనుకున్నది సాధించాడు. తిరుగులేని మెజార్టీతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. అసలు జగన్‌ గెలుపుకు కారణాలంటే అన్న విషయాలపై ఓ సారి చర్చించుకుంటే ప్రధానకారణం ప్రజల మధ్యే ఉండటం. అసెంబ్లీ సమావేశాలను సైతం కాదనుకొని ప్రతిరోజూ ఏదో ఒక కార్యక్రమాలతో ప్రజలకు అందుబాటులో ఉండటం జగన్‌ కి కలిసొచ్చిందని రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు. అధికార టీడీపీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపటమే కాకుండ పాదయాత్రలతో ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాడని చెబుతున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వ అవినీతిపై నిలదీస్తే సస్పెండ్‌ చేస్తూ నోరు ఎత్తనీయడం లేదన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగాడు. అదేవిధంగా ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట మార్చాడన్న జగన్‌ ఆరోపణలు ఫలించాయి. అంతేకాకుండా బీజేపీతో జగన్‌ లోపాయికారి ఒప్పందం చేసుకొన్నాడన్న టిడిపి ఆరోపణలను తిప్పికొట్టడమే కాదు వైసీపీ ఎంపీలతో మూకుమ్మడి రాజీనామాలు చేయించాడు. వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా తీసుకురాగలదని ప్రజలకు తెలియజెప్పాడు. ఇక ఇసుక మాఫియా, సుజనా చౌదరి అవినీతి, ప్రభుత్వ పథకాల వైఫల్యాలపై ఎప్పటికప్పుడు చంద్ర బాబుని నిలదీస్తూ వైసీపీ పార్టీ ఆందోళనలు చేసింది. గడగడపకూ వైసీపీ అన్న నినాదం కూడా బాగా పనిచేసింది. కిందిస్థాయి నుంచి కార్యకర్తలను బలోపేతం చేసి ప్రభుత్వ వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్లగలిగాడు. ఇక అలు పెరగకుండా , ఎవరూ సాహించని విధంగా ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయవరకు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అర్థం చేసుకొని అందుకు తగిన విధంగా వ్యూహరచన చేశాడు. 5ఏళ్ల పాటు అధికారం కోసం అహర్నిశలు కష్టపడిన జగన్ని ప్రజలు ఆదరించారు. తమ ఓటుతో గెలిపించారు.