టీడీపీ ఓటమిలో జనసేన కీలక పాత్ర?

0
61
ysrcp and tdp
ysrcp and tdp

ఏపీ శాసనసభ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఓటమి వెనుక జనసేన పార్టీ కీలక పాత్ర పోషించినట్టు ఓట్ల లెక్కలు తేటతెల్లం చేస్తున్నాయి. కనీ, 32 స్థానాల్లో టీడీపీ విజయావకాశాలను జనసేన పార్టీ అభ్యర్థులు దెబ్బతీశారు. ఫలితంగా టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఓటమిని మూటగట్టుకుంది.

ఈ ఎన్నికల్లో వైసీపీ 150 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇందులో 32 చోట్ల వైకాపా అభ్యర్థులు సాధించిన మెజారిటీ కంటే జనసేన గణనీయమైన ఓట్లు సాధించడం గమనార్హం. 2009లో ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని ఇలాగే దెబ్బతీసింది. ఆ ఎన్నికల్లో టీడీపీ 80 స్థానాల్లో రెండో స్థానంలో నిలువగా.. అక్కడ కాంగ్రెస్‌ సాధించిన మెజారిటీ కంటే పీఆర్పీకి అధిక ఓట్లు రావడం విశేషం. అలాగే ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం 5 వేల ఓట్ల లోపు ఓడిపోయిన స్థానాలు 28 వరకు ఉన్నాయి.

ఈ దఫా ఎలమంచిలిలో టీడీపీ అభ్యర్థిపై వైసీపీకి 4 వేల ఓట్లు అధికంగా రాగా.. జనసేనకు 16,500 ఓట్లు వచ్చాయి. రామచంద్రపురంలో వైసీపీకి 5 వేల ఓట్లు మెజారిటీ దక్కగా.. జనసేనకు 17,592 ఓట్లు వచ్చాయి. తణుకులో వైసీపీ 1264 ఓట్లతో గెలిస్తే జనసేనకు అక్కడ 35,502 ఓట్లు పడ్డాయి. విజయవాడ వెస్ట్‌లో వైసీపీ 6 వేల ఓట్ల తేడాతో గెలిస్తే జనసేనకు 22,312 ఓట్లు వచ్చాయి.

నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ 1587 ఓట్లతో ఓడిపోగా జనసేనకు 4,104 ఓట్లు పడ్డాయి. తిరుపతిలో వైసీపీ 708 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచింది. ఇక్కడ జనసేన అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తికి 12 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇలాగే, అనేక నియోజకవర్గాల్లో వైసీపీ సాధించిన మెజార్టీ ఓట్ల కంటే జనసేనకు వచ్చిన ఓట్లు అధికంగా ఉన్నాయి.