17వ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యుడిని తానేనని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. అదేసమయంలో అమేథీ స్థానంలో తనను ఓడించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి, కేంద్రంలో మరోమారు అధికారాన్ని ఏర్పాటు చేయబోతున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించడానికి, తన రాజీనామాపై చర్చించడానికి వర్కింగ్ కమిటీ త్వరలో సమావేశమవుతుందన్నారు. ప్రజల నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు గెలుపు కోసం చాలా కష్టపడ్డారన్నారు. తనను గెలిపించిన వయనాడ్ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు రాహల్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అమేథీలో తనపై గెలిచిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి శుభాకాంక్షలు తెలిపారు. అమేథీ ప్రజలను ప్రేమతో చూసుకోవాల్సిందిగా ఆమెకు విజ్ఞప్తి చేశారు. సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీతో ఏకీభవించే వారు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రచారంలో తాను ఏం మాట్లాడినా ప్రేమతోనే మాట్లాడానని, అలాగే వారు తనను ఎంతగా నిందించినా ప్రేమతోనే స్వీకరించానని చెప్పుకొచ్చారు. తనకు ప్రత్యర్థులు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదన్నారు.