జోరుగా జగన్ ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు

0
51

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం జోరుగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 30వ తేదీ ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య జగన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ప్రమాణస్వీకార కార్యక్రమానికి కనీసం 5 నుంచి 7 లక్షల మంది హాజరు అవుతారని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కనీసం 20 ఎకరాల ఖాళీ స్థలాన్ని ఎంపిక చేయాలని జగన్ వైసీపీ నేతలను ఆదేశించినట్లు సమాచారం. ప్రమాణ స్వీకారానికి పెద్దసంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను జగన్‌ ఆదేశించారు.

జగన్‌ను విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు కలిసి ప్రమాణస్వీకార ఏర్పాట్లపై చర్చించారు. జగన్ ప్రమాణస్వీకార వేదికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తొలుత విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయాలని జగన్ భావించారు. అయితే ట్రాఫిక్ సమస్య తీవ్రం అవుతుందని అధికారులు సూచించడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు.

ప్రస్తుతం విజయవాడలోని చినఅవుటపల్లిలో సిద్ధార్థ మెడికల్ కాలేజీకి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. జగన్ ప్రమాణ స్వీకారోత్స ఏర్పాట్లు 20 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి కూడా భోజనాలు కూడా వడ్డించేలా ఏర్పాట్లు చేయాలని వైకాపా నేతలు భావిస్తున్నట్టు సమాచారం.