ఇండిపెండెంట్ కంటే తక్కువ ఓట్లు పొందిన టీడీపీ అభ్యర్థి ఎవరు?

0
41

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ఓ గుణపాఠం నేర్పాయి. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా, అనేక ప్రాంతాల్లో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లను కోల్పోయారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉండి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కిడారి శ్రవణ్‌కు ఓ స్వతంత్ర అభ్యర్థి కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. మొత్తం 175 సీట్లకుగాను టీడీపీ కేవలం 23 సీట్లు మాత్రమే దక్కించుకుంది. మిగిలిన సీట్లలో వైకాపాకు 151, జనసేనకు ఒకటి చొప్పున వచ్చాయి.

ఈ నేపథ్యంలో కిడారి శ్రవణ్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారారు. తన తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన కిడారి శ్రవణ్.. అరకు స్థానం నుంచి పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,57,575 ఓట్లు పోలుకాగా, డిపాజిట్ దక్కాలంటే 26263 ఓట్లు రావాల్సి వుంది. కానీ, కిడారి శ్రవణ్‌కు కేవలం 19929 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సియ్యారి దొన్నుదొరకు 27660 ఓట్లు పొంది డిపాజిట్ దక్కించుకున్నారు. మొత్తంమీద టీడీపీ అభ్యర్థులు జగన్ సునామీలో గల్లంతయ్యారు.