పూర్తి మెజార్టీ ఉంది.. ప్రత్యేక హోదా ఇస్తారో లేదో.. అయినా పోరాటం

0
51

ప్రత్యేక హోదాపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారాయి. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ఏర్పాటు కానున్న బీజేపీ సర్కారుకు సంపూర్ణ మెజార్టీ ఉందని, అందువల్ల ప్రత్యేక హోదా ఇస్తారో లేదో చెప్పలేనని, కానీ ప్రత్యేక హోదా మన హక్కు అని దానికోసం పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కోసం జగన్ ఆదివారం ఢిల్లీ వెళ్లారు. మోడీ, ఆ తర్వాత ఏపీ భవన్ అధికారులతో సమావేశం అనంతరం జగన్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఓవర్ డ్రాఫ్టు, ప్రత్యేక హోదా, పోలవరం, నవరత్నాల అమలు, సంపూర్ణ మద్యపాన నిషేధం తదితర అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

ముఖ్యంగా ప్రత్యేక హోదాపై జగన్ మాట్లాడుతూ, బీజేపీకి 250 సీట్లు వచ్చివుండినట్టయితే ఖచ్చితంగా అపుడు తమ మద్దతు అవసరమయ్యేదని, అపుడు ప్రత్యేక హోదా ఇస్తామంటేనే మద్దతు ఇస్తామని తేల్చి చెప్పేవాడనని తెలిపారు. కానీ, ఇపుడు సంపూర్ణ మెజార్టీతో ఇతర పార్టీలతో అవసరం లేకుండానే బీజేపీ సర్కారు ఏర్పాటుకానుందన్నారు.

అందువల్ల ప్రత్యేక హోదాపై పోరాటం చేయక తప్పదన్నారు. అయితే, కేంద్రానికి మన బాధలు చెబుతాం. ప్రధానిని కలిసినపుడుల్లా ప్రత్యేక హోదా గురించి కదిలిస్తూనే ఉంటా. ప్రత్యేక హోదా మన హక్కు. రాష్ట్రాన్ని బాగా నడపాలన్న తపన ఉంది కాబట్టే రాష్ట్రాన్ని ఆదుకోవాలని మోడీని కోరినట్టు ఆయన తెలిపారు.

ఇకపోతే, సంపూర్ణ మద్యపాన నిషేధం ఇపుడే సాధ్యపడదన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా దశల వారీగా దాన్ని అమలు చేస్తామన్నారు. 2024 సంవత్సరం నాటికి ఫైవ్ స్టార్ హోటళ్ళలో మాత్రమే మద్యం విక్రయాలు జరిపేలా నిషేధం అమలు చేస్తామన్నారు.