30న ప్రమాణం.. ఈ ఐదేళ్ళూ పేదల కోసమే : నరేంద్ర మోడీ

0
51

దేశ ప్రధానిగా ఈ నెల 30వ తేదీన నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు.. అతి కొద్దిమది మాత్రమే ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్టు కేంద్ర వర్గాల సమాచారం. అయితే, ఇదే రోజు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజున తన ప్రమాణ స్వీకారం ఉన్నందున నరేంద్ర మోడీ విజయవాడకు రాకపోవచ్చని భావిస్తున్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 303 సీట్లు కైవసం చేసుకోగా, ఎన్డీయే కూటమి 353 సీట్లను సొంతం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ మార్కు మాత్రం 272 మాత్రమే.

లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత మోడీ తొలిసారి తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా తన పాతకాలపు జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. తనను పెంచి పోషించిన గడ్డకు, తనకు గాఢానుబంధం ఉందన్నారు. గుజరాతీయులను దర్శనం చేసుకునేందుకు ఇక్కడకు వచ్చానని, వారి ఆశీర్వాదాలు తనకు ప్రత్యేకమైనవన్నారు.

2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లో జరిగిన అభివృద్ధిని దేశ ప్రజలు తెలుసుకున్నారనీ, 2019లో మాత్రం దేశ ప్రజలంతా సానుకూల దృక్పథంతో ఓటు వేశారన్నారు. అందువల్ల రాబోయే ఐదేళ్ళ కాలం సామాన్యుల సమస్యల పరిష్కారం కోసం వినియోగించుకోవాలన్నారు. ప్రపంచంలో దేశ స్థాయిని మరింతగా పెంచాలన్నారు.