జగన్ డ్రీమ్ టీమ్ సిద్ధం.. ప్రకటనే తరువాయి…

0
51

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఈ నెల 30వ తేదీన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అదేసమయంలో తనకంటూ ప్రత్యేకమైన జట్టును జగన్ సిద్ధం చేసుకున్నారు. ఇందులోభాగంగా, రాష్ట్ర డీజీపీగా గౌతం సవాంగ్‌ను ఎంపిక చేయగా, రాష్ట్ర నిఘా విభాగం అధిపతిగా స్టీఫెన్ రవీంద్రను ఎంపిక చేశారు. అయితే వీరిద్దరి నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

అదేవిధంగా ప్రభుత్వ సలదారుగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం లేదా శామ్యూల్‌లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. అలాగే, ముఖ్యమంత్రి కార్యాలయంలోకి (సీఎంవో) ధనుంజయ రెడ్డి, రాజశేఖర్‌లతో పాటు.. కేంద్ర సర్వీసుల్లో ఉన్న పీవీ రమేశ్, ధర్మారెడ్డిలను తిరిగి రాష్ట్రానికి పిలిపించనున్నారు.

తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్నెలు లేదా ఒకయేడాది లోపు మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని జగన్ ప్రకటించారు. ఇందుకోసం ఆయన తన డ్రీమ్‌ టీమ్‌ను ఎంచుకునే పనిలో పడ్డారు. తన పాలన పారదర్శకంగా ఉండటమే కాకుండా, నీజాయితీగా, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండాలని భావిస్తున్నారు.

ఇందుకోసం అవినీతిపరులపై ఉక్కుపాదం మోపేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. పైగా, రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపట్టనున్నారు. ఈ ప్రక్షాళన కూడా మామూలుగా ఉండబోదని జగన్ ఇప్పటికే ప్రకటించారు.

నిజానికి ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్‌ ముగిసిన నాటి నుంచే పాలనలో కొత్త పోకడను అనుసరించేందుకు అవసరమైన కార్యాచరణను జగన్‌ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్‌ అధికారులుసహా.. గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నవారి పేర్లతో గల జాబితాను తెప్పించుకున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు నవరత్నాలు పేరిట మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు కోసం అయ్యే వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయకల్లాంతో సమీక్షించారు.

అలాగే, రాష్ట్రంలో ప్రస్తుతం కీలకశాఖల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నవారితోపాటు అప్రాధాన్య పోస్టుల్లో ఉన్న ఐఏఎస్‌ అధికారుల పేర్లను, జాబితాను తెప్పించుకున్నారు. ఇలా క్రోఢీకరించిన జాబితాలోని ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో ఇప్పటికే రెండు దఫాలు జగన్‌ భేటీ అయ్యారు. ఈ భేటీలోనే మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాంను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్టు జగన్‌ ప్రకటించారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఏదైనా సలహాలు కావాలంటే ఆయన్ను సంప్రదించాలని ఆ సమావేశంలో స్పష్టం చేశారని ఈ వర్గాలు తెలిపాయి.

మరో రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం.శామ్యూల్‌ను కూడా తన డ్రీమ్‌ టీమ్‌లోకి జగన్‌ తీసుకున్నారు. పంచాయతీరాజ్‌, రెవెన్యూ శాఖల్లో కీలక బాధ్యతలను నిర్వర్తించిన శామ్యూల్‌, ఇప్పటికే పలు అంశాలపై తన సలహాలను ఇస్తున్నారు. ఈ నెల 23 నుంచి అజేయ కల్లాంతో సహా శామ్యూల్‌కూడా తాడేపల్లిలోని జగన్‌ క్యాంపు కార్యాలయంలో సేవలందిస్తున్నారు.

అలాగే, పోలీస్ బాస్, నిఘా విభాగాలకు కూడా కొత్త అధిపతులను నియమిస్తున్నారు. డీజీపీగా నిజాయితీపరుడు, సమర్థుడైన అధికారిగా పేరుతెచ్చుకున్న గౌతం సవాంగ్ పేరును ఖరారు చేయగా, నిఘా విభాగం అధిపతిగా స్టీఫెన్ రవీంద్రను ఎంపిక చేసినట్టు సమాచారం. వీరిద్దరి మధ్య మంచి సఖ్యత ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరంగల్ ఎస్పీగా స్టీఫెన్ పని చేశారు.

ఆ సమయంలో గౌతం సవాంగ్ వరంగల్ రేంజ్ డీఐజీగా విధులు నిర్వహించారు. మావోయిస్టుల కదలికలపై పైచేయి సాధించడం, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి సంవాగ్ ఆదేశాలు సూచలను ప్రకారం అప్పట్లో స్టీఫెన్ మెరుగైన ఫలితాలను సాధించారు. దీంతో వీరిద్దరినీ రెండు విభాగాలకు అధిపతులుగా నియమించారు. అయితే, వీటిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.