ఎస్.వి.బి.సి ఛైర్మన్ పదవికి కె.రాఘవేంద్ర రావు రిజైన్

0
73

సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో ఆ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో నియమించిన నేతలు రాజీనామాలు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. వైకాపా ముఖ్యమంత్రి వైఎస్. జగన్ నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే తమను ఖచ్చితంగా తొలగిస్తారన్న నమ్మకం ఉండటంతో ముందుగానే కొందరు నేతలు తప్పుకుంటున్నారు.

ఇలాంటివారిలో దర్శకేందురు కె.రాఘవేంద్ర రావు ఒకరు. ఈయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌కు ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈయన తన పదవి నుంచి సోమవారం తప్పుకున్నారు. వయోభారం కారణంగా బాధ్యతలు మోయలేనంటూ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

ఆయ‌న చెప్పిన కార‌ణం ఏదైనా.. అస‌లు విష‌యం మాత్రం వై.ఎస్‌.జ‌గ‌న్ ప్ర‌భుత్వం రావ‌డ‌మే. కె.రాఘ‌వేంద్ర‌రావు తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు. ఎన్టీఆర్ కాలం నుంచి తెలుగుదేశం పార్టీకి త‌న వంతు ప్ర‌చారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన నామినేటెడ్ ప‌దవి ఇది. కాబ‌ట్టి వెంట‌నే రాజీనామా చేశారు.

మరోవైపు, ఈ నెల 30వ తేదీన జ‌గ‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయనున్నారు. రాగానే గ‌త ప్ర‌భుత్వంలో నామినేటెడ్ ప‌ద‌వులు స్వీక‌రించిన వారంద‌ర్నీ ఇంటికి పంపించేస్తారు. త‌న‌ని రాజీనామా చేయ‌మ‌ని అడిగేలోపే.. కె.రాఘ‌వేంద్ర‌ రావు త‌ప్పుకున్నారు. తితిదే యాజమాన్యానికి, సిబ్బందికి వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలన్నారు ద‌ర్శ‌కేంద్రుడు.