కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన సినీ నటి సుమలత. ఇపుడు ఆమె చూపు కాషాయం వైపు మళ్లింది. నిజానికి ఈ స్థానం నుంచి పోటీ చేసిన ఆమెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇక్కడ నుంచి బరిలోకి దిగిన మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడను అధికార జేడీఎస్ – కాంగ్రెస్ సర్కారు గెలిపించుకోలేక పోయింది.
నిజానికి మాండ్యా లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ సీట్లను జేడీఎస్ కైవసం చేసుకుంది. కానీ, సుమలతపై వీచిన సానుభూతి ముందు జేడీఎస్ నిలబడలేక పోయింది. ఫలితంగా ఆమె బంపర్ మెజార్టీతో గెలుపొందారు. దివంగత నటుడు అంబరీష్ సతీమణిగా ఆమె బరిలోకి దిగారు. ఇక్కడ బీజేపీకి ఏమాత్రం పట్టులేక పోవడాన్ని గ్రహించిన కమలనాథులు తమ మద్దతును సుమలతకే ప్రకటించారు. దీంతో ఆమె విజయం సునాయమైంది.
నిజానికి అంబరీష్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దీంతో మాండ్యా సీటును తనకు కేటాయించాలి సుమలత కోరింది. దీనికి కాంగ్రెస్ నిరాకరించింది. నిజానికి ఈ సీటును సుమలతకు కాంగ్రెస్ కేటాయించివుండివుంటే.. ఖచ్చితంగా మాండ్యా లోక్‌సభ స్థానం కూడా కాంగ్రెస్ ఖాతాలోపడివుండేది.