ఈ నెల 30వ తేదీ గురువారం నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం విజయవాడలో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా పలువురు ప్రముఖులను కొత్త ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఆహ్వానిస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీలను ఆహ్వానించిన జగన్.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సైతం ఆహ్వానించారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవిని స్వయంగా ఆహ్వానించారు. నిజంగా జగన్ నుంచి ఫోను రావడంతో చిరంజీవి ఆశ్చర్యానికి గురయ్యారు.
ఎందుకంటే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ జనసేన సార్వత్రిక ఎన్నికల్లో అవమానకరరీతిలో ఓడిపోయిన విషయం తెల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్నది తేలాల్సివుంది. అలాగే, ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్‌ను కూడా జగన్ ఆహ్వానించారా లేదా అన్నది తెలియలేదు.