నవ్యాంధ్రలోని 25 లోక్‌సభ స్థానాలు ఒక్కో జిల్లాలుగా ఏర్పడనున్నాయి. ఈ దిశగా కొత్త ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తాము అధికారంలోకి వస్తే పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో ఉన్న 25 లోక్‌సభ స్థానాలను ఒక్కో జిల్లాగా చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇపుడు బంపర్ మెజార్టీతో వైకాపా అధికారంలోకి వచ్చింది. దీంతో ఆ హామీని నిలబెట్టుకునేందుకు వీలుగా ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అలాగే, తన మంత్రివర్గంలో కూడా ఒక్కో జిల్లా నుంచి ఒక్కొక్కరికి చొప్పున మొత్తం 25 మందికి చోటు కల్పించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నవ్యాంధ్రలో 13 జిల్లాలు ఉండగా, 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.
వీటిలో అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నర్సారావుపేట, బాపట్ల, ఒంగోలు, నంద్యాల్, కర్నూల్, అనంతపూర్, హిందూపూర్, కడప, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు ఉన్నాయి. ఇపుడు ఇవన్నీ ఒక్కో జిల్లాగా మారనున్నాయి. కాగా, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు జిల్లాలు ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.