మోడీ మంత్రివర్గంలోకి కిషన్ రెడ్డి – ఓబీఎస్ తనయుడు

0
40

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ఏర్పాటు చేసే మంత్రివర్గంలో తెలంగాణ రాష్ట్రం నుంచి సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డితో పాటు.. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం తనయుడు రవీంధ్రన్‌లకు చోటు కల్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఈ నలుగురిలో సీనియర్‌ కిషన్ రెడ్డి అయినందునా మంత్రివర్గంలో తప్పకుండా చోటు దక్కే అవకాశం ఉంది. ఆయనతోపాటు ఎంపీలుగా నిజామాబాద్‌ నుంచి గెలుపొందిన ధర్మపురి అరవింద్, కరీంనగర్‌ నుంచి గెలుపొందిన బండి సంజయ్, ఆదిలాబాద్‌ నుంచి గెలుపొందిన సోయం బాపురావుల్లో మరొకరికి కూడా ప్రాధాన్యం దక్కుతుందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

రాష్ట్రంలో సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా గెలుపొందిన కిషన్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అంబర్‌పేట నియోజకవర్గం నుంచి 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభాపక్ష నేతగా పనిచేసిన అనుభవమూ కిషన్‌రెడ్డికి ఉంది. పార్టీలో అనేక పదవులు అలంకరించారు. పార్టీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్న దృష్ట్యా ఆయనకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.