జగన్ అనే నేను… పట్టాభిషేకానికి సర్వం సిద్ధం

0
44
YS Jaganmohan Reddy
YS Jaganmohan Reddy

నవ్యాంధ్ర నూతన రెండో ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందుకోసం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మధ్యాహ్నం 12.23 నిమిషాలకు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన నవరత్నాల హామీలపై తొలి సంతకం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు, తన మంత్రివర్గ విస్తరణపై కూడా ఆయన దృష్టిసారించారు. ఇదే విషయంపై గవర్నర్ నరసింహన్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అలాగే, ప్రమాణ స్వీకారం తర్వాత శాఖల వారీగా సమీక్షలు నిర్వహించేందుకు కూడా ఆయన సిద్ధమైపోయారు.

ఇందులోభాగంగా, గవర్నర్ నరసింహన్‌తో బుధవారం సాయంత్రం విజయవాడ గేట్ వే హోటల్‌లో జగన్ భేటీ అయ్యారు. గురువారం ప్రమాణస్వీకారోత్సవం కోసం విజయవాడ వచ్చిన గవర్నర్‌తో జగన్ అనేక విషయాలు చర్చించారు. ప్రమాణస్వీకార కార్యక్రమ ఏర్పాట్ల తీరుతెన్నులపైనేకాకుండా, మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ సమావేశాలు, శాసనసభ్యుల ప్రమాణస్వీకారం తదితర అంశాలపై మాట్లాడారు.