గంగవరపు కిషన్ రెడ్డి. నాడు సాధారణ కార్యకర్త. నేడు కేంద్ర మంత్రి. అంచలంచెలుగా ఎదిగిన కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర తరపున కేంద్ర మంత్రిగా గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి.. అనూహ్యంగా ఆయనకు స్థానం దక్కింది. గత 2018 డిసెంబరులో జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి తెరాస అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇదే ఆయనకు కలిసివచ్చింది. నాలుగు నెలల వ్యవధిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేసి గెలుపొందారు.
అయితే, కిషన్ రెడ్డి.. ఓ సాధారణ కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు జన్మించారు. టూల్ డిజైనింగ్‌లో ఆయన డిప్లొమా చేశారు. 1980లో బీజేపీ ఆవిర్భావం నుంచి పార్టీలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కిషన్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు.
1980లోనే రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనర్ పదవి చేపట్టారు. 1983లో బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి, 1984లో ప్రధాన కార్యదర్శి, 1985లో రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. 1992లో బీజేపీ యువమోర్చా జాతీయ కార్యదర్శి, 1992లో ఉపాధ్యక్షపదవి, 1994లో యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2010లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2009, 2014లలో అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధించారు. 2018 శాసనసభ ఎన్నికలలో మరోసారి అంబర్‌పేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
2019 లోక్‌సభ ఎన్నికలలో సికింద్రాబాద్ స్థానం నుంచి విజయం సాధించి తొలిసారి లోక్‌సభలో ప్రవేశించారు. తెలంగాణలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి పదవులు చేపట్టిన వారిలో కిషన్‌రెడ్డి మూడో వ్యక్తి. గతంలో విద్యాసాగర్‌రావు, బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రులుగా పనిచేశారు.