స్పీకర్ పదవా? మాకొద్దు బాబోయ్… పారిపోతున్న ఎమ్మెల్యేలు

0
48

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనభ సభాపతి పదవి అంటేనే ఎమ్మెల్యేలు పారిపోతున్నారు. అయ్యబాబోయ్ ఆ పదవి మాకు వద్దు. పదవి లేకపోయినా ఫర్లేదు అనే విధంగా ఉన్నారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు.

శాసనసభ స్పీకర్‌గా పని చేసిన ఓ నేతా రెండో దఫా ఎన్నికల్లో విజయం సాధించిన దాఖలాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేసి ప్రతిభా భారత్, సురేష్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, తెలంగాణ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనా చారి, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇలా గత చరిత్రను తిరగేసినా ఇదే పరిస్థితి పునరావృతమవుతోంది. దీంతో స్పీకర్ పదవి అంటేనే ఆమడదూరం పారిపోతున్నారు.

ఒకసారి స్పీకర్‌ పదవి చేపట్టిన వారు శాసనసభకు దూరమవుతూ వస్తున్న ఆనవాయితీ వారిని భయపెడుతోంది. తెనాలి నుంచి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున గెలుపొందిన నాదెండ్ల మనోహర్‌ రెండోసారి విజయం సాధించిన తర్వాత తొలుత డిప్యూటీ స్పీకర్‌గా, ఆ ్రువాత స్పీకర్‌గా వ్యవహరించారు. ఆ పదవి చేపట్టిన తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున బరిలోకి దిగి ఘోర పరాజయం చవిచూశారు. తాజాగా జరిగిన ఈ ఎన్నికల్లో కూడా ఆయన అదే నియోజకవర్గం నుంచి జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయారు.

ఇక తాజా మాజీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుదీ అదే పరిస్థితి. నరసరావుపేట నుంచి వరుసగా ఐదుపర్యాయాలు గెలుపొందిన కోడెల హోంమంత్రి వంటి కీలక శాఖలను కూడా నిర్వహించారు. వైఎస్సార్‌ ప్రభంజనంలో 2004 – 2009లో ఓటమి పాలైనప్పటికీ తిరిగి 2014లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి మళ్లీ శాసనసభలో అడుగు పెట్టగలిగారు. మంత్రి పదవి కోసం ఎంత ప్రయత్నించినా సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆయనకు స్పీకర్‌ పదవి ఇవ్వగా అయిష్టంగానే చేపట్టారు.

ఇపుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ సర్కారులో స్పీకర్ పదవిపై ఏ ఒక్క నేతా పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దీంతో స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందోనన్న చర్చ ఆసక్తికరంగా సాగుతోంది.