నవ్యాంధ్రలో అధికారి మార్పిడి జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవడంతో ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేశారు. కొత్త ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. అయితే, శాసనసభ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందో.. టీడీపీ హయాంలో నామినేటెడ్ పదవుల్లో నియమితులైన వారు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు.
మొన్నటికిమొన్న ఎస్.వి.బి.సి ఛైర్మన్ బాధ్యతల నుంచి ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు తప్పుకున్నారు. వయోభారం కారణంగా ఈ బాధ్యతలను నిర్వర్తించలేనంటూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
ఇపుడు చలనచిత్ర అభివృద్ధి మండలి (ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – ఎఫ్.డి.సి) ఛైర్మన్ పదవికి ప్రముఖ పారిశ్రామికవేత్త అంబికా కృష్ణ రాజీనామా చేశారు. గత 13 నెలలుగా ఆయన ఈ బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చారు.
దీనిపై ఆయన స్పందిస్తూ, వాస్తవానికి తనకు వచ్చే సెప్టెంబరు వరకు పదవీకాలం ఉందన్నారు. కానీ, మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు వివరించారు. తాను రాజీనామా చేసింది ఎఫ్.డి.సి ఛైర్మన్ గిరికి మాత్రమేనని తెలుగుదేశం పార్టీకి కాదని ఆయన వివరణ ఇచ్చారు.