సీఎం జగన్ వేతనం ఒక్క రూపాయి.. ఎన్టీఆర్ కంటే వైఎస్ఆర్ ముందు…

0
60

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఒక్క రూపాయి మాత్రమే నెల వేతనం తీసుకోనున్నారు.

నిజానికి ఒక్క రూపాయి వేతనం స్వర్గీయ ఎన్.టి.రామారావు తీసుకున్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ, ఆయనకంటే ముందుగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్క రూపాయి నెలవేతనం తీసుకున్నారు. అయితే, ముఖ్యమంత్రిగా కాదు… ఓ మంత్రిగా. ఈ విషయం చాలా మందికి తెలియదు.

వైఎస్ఆర్ రాజకీయాల్లోకి రాకముందే ప్రజాసేవకు అంకితమయ్యారు. వృత్తిరీత్యా వైద్యుడు అయిన వైఎస్ఆర్ గుల్బర్గాలో ఎంబీబీఎస్ పూర్తిచేశాడు. ఆ తర్వాత తన తండ్రి రాజారెడ్డి పేరుమీదుగా పులివెందులలో 70 పడకల ఆస్పత్రిని నిర్మించి ఉచితంగా వైద్య సేవలు అందించారు. అపుడు ఆయన ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకునేవారు. అప్పట్లో ఆయన్ని రూపాయి డాక్టరు అని కూడా పిలిచేవారు.

ఆ తర్వాత 1978లో వైఎస్ఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం నాటి అంజయ్య కేబినెట్‌లో వైద్యఆరోగ్యశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. నాడు రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకోవడంతో ముఖ్యంగా రాయలసీమ వ్యథను చూసి తాను మంత్రిగా ఒక్క రూపాయి మాత్రమే నామమాత్రపు వేతనం తీసుకుంటానని.. తన జీతాన్ని రాయలసీమ దుర్బిక్ష పరిస్థితులు తొలగించడానికి విరాళంగా తీసుకోవాలని సీఎంను కోరారు. దీనిపై అప్పటి సీఎం అంజయ్య వైఎస్ను మెచ్చుకుంటూ పత్రిక ప్రకటన విడుదల చేశారు. అది పత్రికల్లో అచ్చయ్యింది.

రూపాయికే రాజ్యాంగబద్ధ పనుల్లో పనిచేసిన నేతలు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలుగు ప్రజల గుండెల్లో తిరుగులేని, చెదిరిపోని స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు నవ్యాంధ్ర నూతన సీఎం జగన్‌కు కూడా రాష్ట్ర లోటు బడ్జెట్ ద‌ృష్ట్యా రూపాయికే సీఎంగా సేవలందిచాలని నిర్ణయించుకున్నారు. మరి జగన్ కూడా దివంగత నేతల మాదిరి మంచి పేరు తెచ్చుకుంటాడో.. లేదో వేచి చూడాలి.