నా నటనకు రహస్యం ఇదే : రష్మిక మందన్నా

0
49

తెలుగు చిత్ర పరిశ్రమలో తారా పథంలో దూసుకెళుతున్న హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. ఈ కన్నడభామ ఏ ముహూర్తాన తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో కానీ వరుస ఆఫర్లు వస్తున్నాయి. పాత్ర ఏదైనా సరే ఇట్టే ఒదిగిపోతోంది. అది డీగ్లామరస్సా లేదా ట్రెడిషనల్ పాత్రనా అనేదానితో సంబంధం లేకుండా ఒదిగిపోతోంది.

రష్మిక మందన్నా “ఛలో” మూవీతో తెలుగు వెండితెరకు పరిచయం కాగా, “గీతగోవిందం” చిత్రంతో ఈ అమ్మడు రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కేవలం రెండు చిత్రాలతోనే మంచి ప్రేక్షకాధారణ సంపాదించుకున్న రష్మిక.. ‘గీత గోవిందం’ చిత్రంలో ఆమె నటనకు సినీ జనాలు ఫిదా అయ్యారు.

ఆ తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. పైగా, టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ హీరోయిన్‌గా మారిపోవడానికి గల కారణాలేంటి అనే విషయంపై ప్రస్తావిస్తే… ‘మొదటి సినిమా చేసే వరకు కూడా నాకు నటనలో అసలు ఓనమాలు కూడా రావు. పాఠశాలలో ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా డ్యాన్సులు చేసేదాన్ని కానీ నటనవైపు అస్సలు వెళ్లేదాన్ని కాదు. ఒకే ఒకసారి మాత్రం ప్రయత్నించినా నటించలేకపోయా. ఇక అప్పటి నుండి నటన జోలికి వెళ్లలేదు.

కానీ, తన తొలి చిత్రం కోసం కెమెరా ముందు నిలబడినప్పుడు నాలా నేను కనిపించాలనుకున్నా. ఆర్టిఫిషియల్ నటన కనబరుస్తూ ప్రత్యేకంగా హావభావాలు పలికించకుండా సన్నివేశంలోని సందర్భం నిజంగా నాకే ఎదురైతే ఎలా స్పందిస్తానో ఊహించుకుంటూ అందుకు తగ్గట్టుగా నటించాను.

అలా చేయడం వలనే నాలో ఒరిజినాలిటీ బయటికి వచ్చింది. నా పాత్రల్లో కనిపించే సహజత్వం వెనుక అసలు రహస్యం అదే’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ కారణంగానే హీరోలు, దర్శకనిర్మాతలు తన వెంట పడుతున్నారని తాను భావిస్తున్నట్టు చెప్పుకొచ్చింది.