జాతిపిత మహాత్మా గాంధీ నిన్నటికి నిన్న బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇపుడు ఓ ఐఏఎస్ అధికారిణి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. వీటిపై పెద్ద దుమారమే చెలరేగింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాలను తొలిగించాలని, భారత కరెన్సీ నోట్లపై ఉన్న ఆయన బొమ్మను తీసేయాలంటూ ఐఏఎస్ అధికారిణి, బృహక్ ముంబై కార్పొరేషన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ నిధి చౌదరి గతనెల 17న ట్వీట్ చేశారు. గాంధీని హత్యచేసిన గాడ్సేకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో దాన్ని తొలిగించారు.
ట్వీట్ వ్యగ్యంగా పెట్టానని, దీన్ని అపార్థం చేసుకున్నారని ఆమె వివరణ ఇచ్చారు. “నేను గాంధేయవాదిని. గాంధీ లేదా ఏ ఇతర స్వాతంత్య్ర సమరయోధులను కించపరచను. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో గాంధీజీకి వ్యతిరేకంగా నడుస్తున్న తీరు”పై వ్యగ్యంగా స్పందించాను. ఇది చట్టవ్యతిరేకమైనదేమీ కాదు. ట్వీట్ మొత్తం చదివితే ఈ విషయం అర్థమవుతుందంటూ వివరణ ఇచ్చారు.
దీనిపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సీఎం అశోక్ చవాన్, ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ ఆదివారం స్పందించారు. ఈ ట్వీట్ ఖండించదగినది. ఇది ఆమె దిగజారుడు ఆలోచనలను తెలియజేస్తున్నది. ఇలాంటి ఆలోచనలను ఇప్పటికైనా ఆపేయాలి. రాష్ట్ర ప్రభుత్వం.. గాంధీ భావజాలాన్ని సమర్థిస్తుందా లేక గాడ్సేదా అనేది స్పష్టంగా తెలియజేయాలి అని అశోక్‌చవాన్ అన్నారు. గాంధీపై ఇష్టానుసామాట్లాడిన ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయాలని అవద్ డిమాండ్ చేశారు.