రాజకీయాలకు రాములమ్మ స్వస్తి..?

0
86

టాలీవుడ్‌లో లేడీ అమితాబ్‌గా పేరుగడించిన ఒకనాటి సీనియర్ హీరోయిన్ విజయశాంతి. ఈమె తెలుగులో ఓ వెలుగు వెలిగింది. మంచి ఫామ్‌లో ఉండగానే సినిమాలకు దూరమైంది. కొద్దికాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు. సొంతపార్టీతో పాటు బీజేపీ, తెరాస పార్టీల్లో చేరారు. ఇపుడు కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్నారు. అయితే, తెరాసలో ఉన్న సమయంలో ఈమె లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేస్తున్నా విజయం మాత్రం వరించలేదు.

దీంతో తన రాజకీయాలు అచ్చిరావని గ్రహించారు. ఫలితంగా 13 యేళ్ల తర్వాత సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రిన్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ఇందులో విజయశాంతి అత్యంత కీలకమైన పాత్రను నటించనుందట. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

మరోవైపు, ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ఆమె.. ఇకపై సినిమాల్లో కూడా కొనసాగుతారా..? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఇవి కాస్త ఆమె చెవిన పడటంతో వాటిపై స్పష్టతను ఇచ్చింది రాములమ్మ. ఆరు నెలల క్రితమే తనకు సినిమా అవకాశం వచ్చిందని, కానీ అప్పటికి పార్టీ ప్రచార బాధ్యతలు ఉండటంతో సాధ్యం కాదని ఒప్పుకోలేదని విజయశాంతి తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు ముగియం.. రాజకీయ అవసరాలు పెద్దగా లేనందునే సినిమాలపై దృష్టిపెట్టానని పేర్కొన్నారు. ఇకపై రెండింటిలో కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. తనకు ఏ పని అప్పగించినా చిత్తశుద్ధితో చేయడం అలవాటని విజయశాంతి వివరించారు.