నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 8వ తేదీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే కసరత్తు పూర్తిచేసినట్టు తెలుస్తోంది. జిల్లాకు ఒకరు చొప్పున ఆయన మంత్రులుగా తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఇందులో ఎవరికి చోటు దక్కుతుంది.. ఎవరిని అదృష్టం వరిస్తుందన్న అంశంపై చర్చ సాగుతోంది.
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీకి రికార్డు స్థాయిలో 151 సీట్లు వచ్చిన విషయం తెల్సిందే. వీరితో పాటు.. ఎన్నికల హామీల్లో భాగంగా కొందరికి మంత్రిపదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి సీనియర్ నేతలకు ఆయన మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.
దీంతో మంత్రివర్గం కూర్పుపై ఇపుడు సర్వత్రా చర్చ మొదలైంది. అయితే, ఈ లెక్కలు అన్ని జిల్లాల్లో ఒక ఎత్తు అయితే, రాజకీయాలకు ఆయువు పట్టుగా భావించే కృష్ణా జిల్లాలో మాత్రం మరో లెక్క ఉంది. ఈ జిల్లాలో మొత్తం 16 సీట్లకుగాను టీడీపీ 14 చోట్ల విజయభేరీ మోగించింది.
వీరిలో గుడివాడలో కొడాలి నాని, జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను, పెనమలూరులో మాజీ మంత్రి పార్థసారథి, మచిలీపట్నంలో పేర్ని నాని, విజయవాడ సెంటర్‌లో మల్లాది విష్ణు, తిరుపూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి, విజయవాడ వెస్ట్ ఎమ్మల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు మంత్రిపదవులపై ఆశలుపెట్టుకున్నారు.