ఫోర్జరీ, డేటా చౌర్యం కేసుల్లో తనను అన్యాయంగా ఇరికించారని టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ ఆరోపించారు. ఆయన ముందస్తు బెయిలు కోసం చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో అజ్ఞాతం వీడి బయటకొచ్చారు. ఆ తర్వాత మంగళవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు.
పోలీసులు ఆయనను దాదాపు ఐదు గంటలపాటు విచారించారు. విచారణ సందర్భంగా తాము అడిగిన ప్రశ్నల్లో ఏ ఒక్కదానికీ రవిప్రకాశ్ సరైన సమాధానం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో నమోదైన రెండు కేసుల్లోనూ ఆయనను ప్రశ్నిస్తున్నట్టు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.
రవిప్రకాశ్ నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో బుధవారం ఉదయం 11 గంటలకు మరోమారు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చినట్టు పేర్కొన్నారు. తొలి రోజు విచారణ ముగిసిన అనంతరం స్టేషన్ నుంచి బయటకు వచ్చిన రవిప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. టీవీ9 చానల్‌ను ఇద్దరు ధనవంతులు అక్రమంగా కొనుగోలు చేసి తనపై దొంగ కేసులు పెట్టారని ఆరోపించారు.
తనను అన్యాయంగా మూడు కేసుల్లో ఇరికించి బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. విలువలకు-అవినీతికి, మాఫియాకు-మీడియాకు మధ్య పోరాటం జరుగుతోందని, చివరికి సత్యం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన చివరి రక్తపు బొట్టు వరకు వాస్తవం కోసం, సమాజ హితం కోసం పోరాడతానన్నారు. తనకు నైతికంగా మద్దతు ఇస్తున్న అందరికీ ఈ సందర్భంగా రవిప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు.