సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ.60 వేల కోట్లు

0
55

దేశంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ.60 వేల కోట్లు అని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ వెల్లడించింది. ఇది 2014లో జరిగిన ఎన్నికల ఖర్చుకు రెట్టింపు అని చెప్పింది.

“ఈ రూ. 60 వేల కోట్లలో 15-20 శాతం ఎలక్షన్‌ కమిషన్‌ చేసిన వ్యయమే. సగటున ఒక్కో నియోజకవర్గంలో రూ.100 కోట్ల మేర ఖర్చు జరిగింది. సగటున ఒక్కో ఓటరుపై పెట్టిన ఖర్చు రూ.700. ఎన్నికల నిర్వహణ, పార్టీలు ప్రచారం నిమిత్తం చేసిన వ్యయం, ఇతరత్రా ప్రలోభాలూ… వీటన్నింటినీ లెక్కవేస్తే ఇంత దమొత్తం తేలింది” అని సీఎంఎస్‌ ఓ నివేదికలో తెలిపింది.

ఈ ఎన్నికల కోసం అధికార బీజేపీ పార్టీ ఏకంగా రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దేశం మొత్తం జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం అయిన ఖర్చులో బీజేపీ మాత్రమే 45 శాతం ఖర్చు చేసిందని వెల్లడించారు.

ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ… మన దేశంలో ఎన్నికలంటే పూర్తీగా డబ్బుతో ముడిపడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలూ చేసే ఖర్చుకి అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు.