ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కొత్త సభాపతిగా సీనియర్ నేత తమ్మినేని సీతారాం పేరును ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. ఇదే విషయంపై తమ్మినేని వద్ద ప్రస్తావిస్తే… నాయకుడు ఏది ఆదేశిస్తే, దాన్ని తు.చ. తప్పకుండా పాటించడం తనకు మొదటి నుంచి ఉన్న అలవాటన్నారు.
వైసీఎల్పీ మీటింగ్ అనంతరం, తనను రమ్మనమని జగన్ కబురు చేస్తే వెళ్లానని, ‘అన్నా, మీకు చాలా బరువైన బాధ్యతలు అప్పచెబుతున్నా. మీ అనుభవాన్ని జోడించాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరిస్థితిలో శాసనసభాపతిగా మీ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తున్నాను’ అని జగన్ తనతో అన్నారని గుర్తు చేశారు.
దీనికి తాను సమాధానమిస్తూ, ‘తప్పకుండా సార్, మీరు నాపై ఉంచిన అపారమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను’ అని చెప్పానని వెల్లడించారు
గత ప్రభుత్వ హయాంలో శాసనసభపై కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి నిలబెట్టేందుకు తనకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటానని, ఉన్నత విలువలతో కూడిన శాసనసభగా నిలబెడతానని, అందుకు సభ్యులు కూడా సహకరించాలని జగన్‌కు విజ్ఞప్తి చేసినట్టు తమ్మినేని సీతారాం చెప్పారు.