నగరి ఎమ్మెల్యే ఆర్కే. రోజా విజయవాడలోనే ఉండాలంటూ జగన్ టీమ్ ఆదేశించింది. ఏపీ మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారో శుక్రవారం రాత్రి తేలిపోయింది. వీరంతా శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరుపొందిన రోజా పేరు మంత్రివర్గంలో లేకపోవడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మంత్రివర్గ కూర్పు సమయంలో జగన్ ఇదే విషయమై రోజాతో రెండుసార్లు చర్చించి నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. కొన్ని సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ కూర్పు చేశామని, అందుకే మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోతున్నామని రోజాకు జగన్ వివరించినట్టు సమాచారం.
అంతేగాకుండా, పార్టీలో ఇన్నాళ్లపాటు రోజా చేసిన సేవలను ప్రస్తావించిన జగన్ ఆమెను విజయవాడలోనే అందుబాటులో ఉండాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, రోజాకు మరో కీలక పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్నికల ఫలితాలు వచ్చాక జగన్ తిరుమల వచ్చినప్పుడు రోజా ప్రతి కార్యక్రమంలోనూ ఆయన వెన్నంటే ఉన్నారు. తద్వారా మంత్రి పదవి రేసులో తాను ముందున్నానని సంకేతాలు పంపారు. అనూహ్యంగా ఆమె పేరు లేకుండానే జగన్ తన క్యాబినెట్ కూర్పు చేయడం రాజకీయ వైచిత్రి!.