పడక గదిలో భార్య ఉరివేసుకుంటే.. కిటికీలో నుంచి వీడియో తీసిన భర్త

0
62

పడక గదిలో భార్య ఉరివేసుకుంటుంటే కిటికీలో నుంచి భర్త వీడియో తీశాడు. భార్య అఘాయిత్యానికి పాల్పడుతుంటే కనీసం కాపాడే ప్రయత్నం చేయలేదు. ఈ విషయాన్ని అతనే పోలీసులకు చెప్పడంతో వారు విస్తుపోయారు.

ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో 2007లో ప్రేమ వివాహం చేసుకున్న సుంచు అరుణ (31), శ్రీనివాస్‌ (35) నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని అరుణ తరచూ ఘర్షణ పడుతూ ఉండేది.

ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్యా మరోమారు గొడవ జరుగగా, అరుణ ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, అరుణ ముక్కు, నోటి నుంచి రక్తం కారడం, ముఖంపై గాయాలు ఉండడంతో పోలీసులు హత్య కేసుగా అనుమానిస్తూ, శ్రీనివాస్‌ను విచారించారు.

భార్య ఉరేసుకున్న తర్వాత, తానే ఓ కర్ర సాయంతో గది తలుపు తెరిచానని, ఆమెను కిందకు దించే సమయంలో కిందపడిందని, దాంతోనే ముఖంపై గాయాలు అయ్యుంటాయని శ్రీనివాస్ పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది.

కాగా, తమ కుమార్తెను భర్తే హత్య చేశాడని, ఆపై ఆత్మహత్యగా చిత్రిస్తున్నాడని శ్రీనివాస్ పై అరుణ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.