ముంబయి: ‘రెండు సినిమాలు చేయగానే సినీ పరిశ్రమపై నెగిటివ్ అభిప్రాయం కలిగిందా?’ అంటూ బాలీవుడ్ నటి జైరా వాసింకు చురకలంటించారు సినీ నటి రవీనా టాండన్. తాను కొనసాగుతున్న రంగం తన మత విశ్వాసాలకు అడ్డుతగులుతోందని, అందుకే సినిమాలకు దూరమవుతున్నానని బాలీవుడ్ నటి జైరా వాసిం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. దీని గురించి జైరాపై రవీనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘రెండు సినిమాలకే చిత్ర పరిశ్రమపై ఇలాంటి నెగిటివ్ అభిప్రాయాన్ని పెంచుకునేవారి గురించి పట్టించుకోనవసరం లేదు. నచ్చకపోతే నిర్మొహమాటంగా వెళ్లిపోవచ్చు. కానీ సోషల్‌మీడియా ద్వారా ఇలాంటి అభిప్రాయాలు వెల్లడించాల్సిన అవసరం లేదు. నేనున్న పరిశ్రమంటే నాకెంతో ఇష్టం. ఫలానా వ్యక్తికి నచ్చకపోతే స్వచ్ఛందంగా తప్పుకోవచ్చు. కానీ ఇలా ఇతరుల్లో చిత్ర పరిశ్రమపై తప్పుడు అభిప్రాయాలు కలిగేలా వ్యాఖ్యలు చేయకూడదు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
జైరా నిర్ణయంపై ఇతర ప్రముఖులేమన్నారంటే..
* ‘ఇది మీ జీవితం. మీకు నచ్చింది చేయండి. భవిష్యత్తులో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. అయితే నా అభిప్రాయంలో కళ, వృత్తి మన జీవితంలో ఓ భాగం. వీటిలోకి మతాన్ని తీసుకురాకూడదు. మతానికి మన వృత్తికి సంబంధం లేదు’- సిద్ధార్థ్
* ‘జైరా చిన్న పిల్ల. ఆమె భవిష్యత్తులో ఎలాంటి రంగాన్ని ఎంచుకున్నా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆమె ధైర్యవంతురాలు. ఆమె ధైర్యాన్ని మెచ్చుకుని ఇలాంటి సమయంలో అండగా నిలవాలి’- నగ్మ
* ‘జైరా పెట్టిన పోస్ట్ మొత్తం నేను చదివాను. ఈ రోజుల్లో యువత ఆలోచనా విధానాలు కలుషితమైపోతున్నాయి. అలాంటివారికి జైరా నిర్ణయం ఓ సమాధానం కావాలని ఆశిస్తున్నాను. జైరా ఆలోచనలను అనుసరించేవారిలో నేనూ ఒకదాన్నని గర్వంగా చెబుతున్నాను’- తనుశ్రీ దత్తా