సెమీస్‌లో నిలిచేదెవరు?

0
44

ప్రపంచకప్‌లో తాజా పరిస్థితిపై సమగ్ర విశ్లేషణ

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లు ఆఖరి అంకానికి చేరుకున్నాయి. ఈ వారాంతానికి లీగ్‌ మ్యాచ్‌లు పూర్తవుతాయి. కాగా మెగా టోర్నీలో మొత్తం పది జట్లు పోటీపడగా ఇప్పటికే అఫ్గానిస్థాన్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ జట్టు ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఇక మిగిలిన ఏడు జట్లలో ఆస్ట్రేలియా 14 పాయింట్లతో ఇప్పటికే సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకోగా రెండో స్థానంలో ఉన్న టీమిండియా తదుపరి బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లతో ఏ ఒక్క మ్యాచ్‌ గెలిచినా నాకౌట్‌కు చేరుకుంటుంది. మరోవైపు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ జట్లు ఇప్పటికే ఎనిమిదేసి మ్యాచ్‌లు పూర్తిచేసుకోగా సెమీస్‌ బెర్తు కోసం జులై 3న తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో తలపడనున్నాయి.

న్యూజిలాండ్‌(8 మ్యాచ్‌లు,11 పాయింట్లు):
ఇప్పటికే న్యూజిలాండ్‌ 11, ఇంగ్లాండ్‌ 10 పాయింట్లతో కొనసాగుతున్న నేపథ్యంలో జులై 3న ఇరు జట్ల నడుమ జరగబోయే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ కీలకంగా మారింది. ఆదివారం రాత్రి టీమిండియాపై ఇంగ్లాండ్‌ గెలిచింది. ఒక వేళ ఇంగ్లాండ్‌ గనుక ఓడుంటే న్యూజిలాండ్‌కి బెర్తు ఖరారయ్యేదే. కానీ టీమిండియాపై మోర్గాన్‌సేన విజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్‌ రేసులో నిలవాలంటే ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించక తప్పదు.

ఇంగ్లాండ్‌(8 మ్యాచ్‌లు, 10 పాయింట్లు):

శ్రీలంక, ఆసీస్‌ జట్లతో రెండు వరుస ఓటముల తర్వాత ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌ బలంగా పుంజుకుంది. కోహ్లీసేనపై 31 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ నేపథ్యంలో కివీస్‌తో ఆడబోయే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ గెలిస్తే ఏ సమీకరణాలతో సంబంధం లేకుండా 12 పాయింట్లతో సెమీస్‌ చేరుకుంటుంది. ఒకవేళ కివీస్‌తో ఓడిపోయి.. బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్‌ గెలిస్తే ఇంగ్లాండ్‌ ఇంటిముఖం పడుతుంది.

పాకిస్థాన్‌ (8 మ్యాచ్‌లు, 9 పాయింట్లు):
అఫ్గాన్‌ చేతిలో త్రుటిలో ఓటమి నుంచి తప్పించుకున్న పాకిస్థాన్‌ జట్టుకు ఇంకా సెమీస్‌ అవకాశాలు మిగిలే ఉన్నాయి. జులై 5న బంగ్లాదేశ్‌తో జరగబోయే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో తప్పక గెలవడంతో పాటు కివీస్‌ చేతిలో ఇంగ్లాండ్‌ ఓడితేనే పాక్‌ జట్టుకు కలిసివస్తుంది. లేదంటే సర్ఫరాజ్‌ జట్టు తిరుగుముఖం పట్టాల్సిందే.

బంగ్లాదేశ్‌(7 మ్యాచ్‌లు, 7 పాయింట్లు):
బంగ్లాదేశ్‌కి ఇంకా సెమీస్‌పై ఆశలు అలానే ఉన్నాయి. ఇప్పటికే ఏడు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు ఏడు పాయింట్లతో ఆరోస్థానంలో కొనసాగుతోంది. ఇంకా భారత్‌, పాక్‌ జట్లతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండూ తప్పకుండా గెలిచి ఇంగ్లాండ్‌ కివీస్‌ చేతిలో ఓడిపోతే.. బంగ్లా 11 పాయింట్లతో సెమీస్‌ చేరుకుంటుంది.

శ్రీలంక (7 మ్యాచ్‌లు, 6 పాయింట్లు):
ఇంగ్లాండ్‌పై అనూహ్య విజయం సాధించి సెమీస్‌ రేసులో ఆశలు నిలుపుకొన్న శ్రీలంక జట్టుకు ఆదివారం కథ అడ్డం తిరిగింది. టీమిండియాపై ఆతిథ్య జట్టు గెలుపొందడంతో శ్రీలంక అవకాశాలకు దారి మూసుకుపోయింది. ఆరు పాయింట్లతో ఉన్న లంక ఇంకా వెస్టిండీస్‌, భారత జట్లతో పోటీ పడాల్సి ఉంది. ఒకవేళ ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా 10 పాయింట్లకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో లంక జట్టు సెమీస్ రేసు నుంచి తప్పుకుంది.