చంద్రబాబు రాకతో కళకళలాడిన రాష్ట్ర పార్టీ కార్యాలయం
పట్టాభిపురం(గుంటూరు): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గుంటూరు రావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచే కార్యకలాపాలు నిర్వహించేందుకుగాను సోమవారం మొదటిసారిగా వచ్చిన చంద్రబాబుకు తెలుగు మహిళలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత పార్టీ కార్యాలయం నాయకులు, కార్యకర్తలతో కళకళలాడింది. చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఉత్సాహాన్ని నింపింది. తామంతా ఓట్లు వేసినా ఎలా ఓడిపోయారయ్యా.. ఎన్నికల్లో మన పార్టీ ఓడిపోయిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం.. ఈవీఎంలలో ఏదో జరిగిందని అనుమానంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. తెనాలి సమీపంలోని ఈపూరుకు చెందిన లీలావతి అనే వృద్ధురాలు మాట్లాడుతూ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. మీరే మా నాయకుడని తన అభిమానాన్ని చాటుకున్నారు. పెదకూరపాడు, గురజాల, పెదనందిపాడు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. చెన్నాయపాలెంలో వైకాపా నాయకులు గ్రామాల్లోకి అడుగుపెట్టనివ్వడంలేదని, దాడులకు పాల్పడుతున్నారని, ప్రస్తుతం పొలం పనులు చేసుకోవాల్సి ఉందని, ఏం చేయాలో అర్థం కావడం లేదని తమ గోడును వెళ్లబోసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెన్నాయపాలెంలో వైకాపా నాయకులు చేస్తున్న దాడులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అధైర్యపడాల్సిన అవసరం లేదని, మనవాళ్లు డీజీపీని కలిసి దాడులను నియంత్రించాలని కోరారని, గ్రామానికి వెళ్లి పనులు చేసుకోండి, యరపతినేని వచ్చి అండగా ఉంటారని ధైర్యం చెప్పారు.
పెదకూరపాడులోనూ వైకాపా నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వాపోయారు. గుంటూరు కార్యాలయంలో నిత్యం అందుబాటులో ఉంటానని, దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. పెదనందిపాడు మండల పార్టీ నాయకులు, మహిళలు మాట్లాడుతూ మేమంతా ఓట్లేశాం.. పార్టీ ఓడిపోవడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని ఆవేదనగా చెప్పారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ పెదనందిపాడు తెదేపాకు కంచుకోట అని గుర్తుచేశారు. అయిదేళ్లపాటు నీతి, నిజాయతీకి కట్టుబడి పాలన అందించామని, మనం చేసిన మంచి పనులే శ్రీరామరక్షగా ఉంటాయన్నారు. తెదేపాను దెబ్బ తీయాలని గతంలో చాలా మంది ప్రయత్నించినా.. వారి ఆటలు సాగలేదన్నారు. తెలుగు యువత అధ్యక్షుడు ఈడే మురళీకృష్ణ, మన్నెం శివనాగమల్లేశ్వరరావు తదితరులు గజమాలతో చంద్రబాబును సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, గల్లా అరుణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, నారాయణ, ఎమ్మెల్యేలు కరణం బలరాం, గద్దె రామ్మోహన్, నిమ్మల రామానాయుడు, మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీలు టి.డి.జనార్దన్, యలమంచలి రాజేంద్రప్రసాద్, అశోక్‌బాబు, మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, బోడె ప్రసాద్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి రాయపాటి రంగారావు, రాయపాటి శ్రీనివాస్, గుంటూరు తూర్పు ఇన్‌ఛార్జి మహమ్మద్ నసీర్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి, మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్ర, నాయకులు పాల్గొన్నారు.