- పాత సెక్యూరిటీ పునరుద్ధరించండి
- రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలివ్వండి
- రాజకీయ కారణాలతోనే తగ్గించారు
- మా హయాంలో ప్రతిపక్ష నేతకు పటిష్ఠ రక్షణ
- ఆయన కుటుంబ సభ్యులకూ కల్పించాం
- హైకోర్టులో చంద్రబాబు పిటిషన్
అమరావతి, జూలై 1: తాను మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్నానని.. తనకు రాష్ట్రప్రభుత్వం తగ్గించిన భద్రతను పెంచాలని కోరుతూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. పాత భద్రతను పునరుద్ధరించాలంటూ సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా, అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్‌కు 2014 నుంచి 2019కు తొలి సీఎంగా వ్యవహరించాను. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించాను. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నాను.
ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉన్న వారు నాకు వ్యక్తిగత భద్రత తగ్గించారు. అలాగే నా రెండు నివాసాల వద్ద కూడా భద్రతను తగ్గించారు. నేను ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం, ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు తీసుకున్న పలు చర్యల కారణంగా నా ప్రాణానికి ముప్పు ఏర్పడిందన్న నివేదికల ఆధారంగా కేంద్రప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా భద్రతను కుదించారు’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్నానని, 2003 అక్టోబరు 1న తనపై నక్సల్స్ దాడి జరిగిందని గుర్తు చేశారు. తన కుటుంబం కూడా వారి హిట్‌లిస్టులో ఉందని.. 2016 అక్టోబరులో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత తనకు, తన కుమారుడు లోకేశ్‌కు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించిందని గుర్తుచేశారు. వీటన్నిటి నేపథ్యంలోనే తనకు జడ్ ప్లస్ భద్రత ఉందన్నారు.
అయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత నెల 25వ తేదీ నుంచి తనకు కేవలం 2+2 భద్రత మాత్రమే కల్పిస్తోందన్నారు. తన కుటుంబానికి కూడా భద్రత తగ్గించిందన్నారు. తన హయాంలో 2014-19 కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి 7+7 రక్షణ కల్పించామని, ఆయన కుటుంబానికి కూడా రక్షణ కల్పించామని తెలిపారు. 2016 అక్టోబరులో ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులు తనను మరింత టార్గెట్ చేసుకున్నారని.. 2018 సెప్టెంబరులో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమాలను బలి తీసుకున్నారని పేర్కొన్నారు.
అలాగే తన హయాంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు తీసుకున్న చర్యల కారణంగా ఎర్రచందనం మాఫియా కూడా తనపై ఆగ్రహంతో ఉందన్నారు. రాష్ట్రం కోసం ముఖ్యమంత్రిగా తాను తీసుకున్న నిర్ణయాల వల్ల పలువురు రాజకీయ ప్రత్యర్థులు తనకు హాని తలపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఏర్పాటు చేసిన ఎన్‌ఎ్‌సజీ భద్రతకు తోడుగా రాష్ట్రప్రభుత్వం కూడా భద్రత కల్పించాలని అభ్యర్థించారు. తనకు భద్రత తగ్గించడంపై రాష్ట్ర స్థాయి భద్రతా సమీక్షా కమిటీ ఎలాంటి నోటీసూ ఇవ్వలేదని, కేవలం రాజకీయ కారణాల వల్లే భద్రత తగ్గించారని ఆరోపించారు. అందువల్ల తన రక్షణకు సంబంధించి పాత విధానాన్నే కొనసాగించాల్సిందిగా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, గుంటూరు అర్బన్ ఎస్పీ, రాష్ట్ర స్థాయి భద్రతా సమీక్ష కమిటీలను పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం విచారించనుంది.