దిల్లీ: చైనా ఫోన్ల రాకతో భారత మొబైల్ మార్కెట్లో ఇతర దేశాల కంపెనీలు డీలా పడ్డాయి. ముఖ్యంగా దక్షిణకొరియా దిగ్గజ మొబైల్ సంస్థ శామ్‌సంగ్.. చైనా కంపెనీల నుంచి పోటీని తట్టుకునేందుకు తమ ఉత్పత్తులపై ధరలు తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా ఆదాయంలో కోతపడటంతో శామ్‌సంగ్ ఖర్చుల హేతుబద్ధీకరణకు సిద్ధమైంది. దీనిలో భాగంగానే ఉద్యోగులను తగ్గించుకుంటోంది.
ఇప్పటికే టెలికాం నెటవర్క్స్ డివిజన్ నుంచి 150 మంది దాకా ఉద్యోగులను తీసేశారట. ఈ ఏడాది అక్టోబరు నాటికి 1000 మంది వరకు ఉద్యోగులను తొలగించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. పరిశ్రమ అంచనాల ప్రకారం.. ప్రస్తుతం శామ్‌సంగ్‌కు భారత్‌లో దాదాపు 20వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో పనితీరు సరిగా లేని, టార్గెట్లు చేరుకోలేని ఉద్యోగుల జాబితాను ఆయా బిజినెస్ హెడ్‌లు కంపెనీ యాజమాన్యానికి అందించినట్లు సమాచారం. సేల్స్, మార్కెటింగ్, ఆర్‌అండ్‌డీ, తయారీ, హెచ్‌ఆర్, కోఆపరేట్ రిలేషన్స్ తదితర విభాగాల్లోని ఉద్యోగులను తొలగించనున్నారు. గత ఏప్రిల్ నుంచి కంపెనీ కొత్త నియామకాలను కూడా నిలిపివేసింది.
ఒకప్పుడు భారత మొబైల్ మార్కెట్లో శామ్‌సంగ్ అగ్రగామిగా ఉండేది. అయితే షావోమీ, వన్‌ప్లస్, వివో వంటి చైనా కంపెనీలు భారత మార్కెట్లోకి అడుగుపెట్టడంతో శామ్‌సంగ్ అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. కౌంటర్ పాయింట్ అధ్యయనం ప్రకారం.. జనవరి-మార్చి మధ్య ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో షావోమీ 43శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. శామ్‌సంగ్ 15శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షావోమీ 29శాతం వాటాతో తొలి స్థానంలో ఉండగా.. 23శాతంతో శామ్‌సంగ్, 12శాతంతో వివో నిలిచాయి.
తక్కువ ధరకే అన్ని ఫీచర్లు ఉన్న ఫోన్లు వస్తుండటంతో చైనా కంపెనీల వైపు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా శామ్‌సంగ్ కూడా స్మార్ట్‌ఫోన్లపై ధరలు తగ్గించాల్సి వచ్చింది. దీంతో కంపెనీ ఆదాయం తగ్గిపోయింది.