ఒక్క ఓటమికి రెండు ప్రతీకారాలు

0
44

ప్రపంచకప్‌లో భారత్‌ X బంగ్లా చరిత్ర

ప్రపంచకప్‌లో భారత్‌ X బంగ్లాదేశ్‌ జట్లు గతంలో మూడుసార్లు పోటీపడ్డాయి. ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో నాలుగోసారి తలపడుతున్నాయి. కాగా, 2007లో పసికూనగా ఉన్న బంగ్లా.. బలమైన టీమిండియాని గ్రూప్‌ దశలోనే సాగనంపి సంచలన సృష్టించింది. అందుకు ప్రతీకారంగా 2011, 2015 ప్రపంచకప్‌లలో ధోనీ నేతృత్వంలోని టీమిండియా ఒక్క పరాజయానికి రెండు ప్రతీకారాలు తీర్చుకుంది. మరోవైపు ప్రస్తుత ప్రపంచకప్‌లో 11 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్న టీమిండియా  నేడు బంగ్లాపై గెలిస్తే 13 పాయింట్లతో సెమీస్‌ చేరుతుంది. ఒకవేళ ఓడిపోతే తదుపరి శ్రీలంకను ఓడించాల్సి ఉంటుంది. ఇక బంగ్లాదేశ్‌ విషయానికి వస్తే ఈ ప్రపంచకప్‌లో నిలబడాలంటే భారత్‌పై తప్పకగెలవాల్సిందే. లేదంటే పాక్‌తో తదుపరి మ్యాచ్‌ తర్వాత ఇంటిముఖం పట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు ఇది ఎంతో కీలకమైన మ్యాచ్‌గా మారింది.
2007లో : బంగ్లా సంచలనం

సచిన్‌, సెహ్వాగ్‌, గంగూలీ, యువరాజ్‌, హర్భజన్‌, జహీర్‌ఖాన్‌లాంటి దిగ్గజాలతో కూడిన రాహుల్‌ ద్రవిడ్‌ సారథ్యంలోని టీమిండియా 2007 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. హబీబుల్‌ బషర్‌ కెప్టెన్సీలోని బంగ్లా జట్టు 5 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించి గ్రూప్‌దశ నుంచే సాగనంపింది. ఈ విజయం బంగ్లా క్రికెట్‌ చరిత్రలో నిలిస్తే.. భారత క్రికెట్‌లో చీకటి రోజుగా మిగిలిపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 49.3 ఓవర్లలో 191 పరుగులు చేసింది. సౌరభ్‌ గంగూలీ(66), యువరాజ్‌ సింగ్‌(47) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో భారత్‌ తక్కువ పరుగులకే పరిమితమైంది. అనంతరం బంగ్లా జట్టు 48.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తిచేసింది.

2011లో: భారత్‌ ప్రతీకారం

2007లో ఓటమికి టీమిండియా 2011లో గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్‌ చేసిన ధోనీసేన నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 370 పరుగుల భారీ స్కోర్‌  సాధించింది. సెహ్వాగ్‌(175), కోహ్లీ (100 నాటౌట్‌) చెలరేగడంతో బంగ్లా ముందు భారీ లక్ష్యం ఉంచారు. లక్ష్య ఛేదనలో గట్టిగానే పోరాడినా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. మునాఫ్‌ పటేల్‌ ఈ మ్యాచ్‌లో తొలిసారి ప్రపంచకప్‌లో నాలుగు వికెట్లను పడగొట్టి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. దీంతో టీమిండియా 87 పరుగుల విజయంతో ప్రతీకారం తీర్చుకుంది.

2015లో: ధోనీసేన ఘన విజయం

2011లో ప్రతీకారం తీర్చుకున్నా అది సరిపోదన్నట్టు 2015 క్వార్టర్‌ ఫైనల్స్‌లో భారీ తేడాతో ధోనీసేన గెలుపొందింది. 109 పరుగులతో విజయం సాధించి బంగ్లాను ఇంటిముఖం పట్టించి భారత్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ శతకంతో కదంతొక్కగా టీమిండియా 302 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. లక్ష్యఛేదనలో చతికిల పడ్డ బంగ్లాపులులు 45 ఓవర్లకే ఆలౌటై 193 పరుగులు చేశారు.