బంగ్లాతో బహుపరాక్‌

0
38

బంగ్లాదేశ్‌తో భారత్‌ పోరు నేడు 
గెలిస్తే సెమీస్‌లో చోటు 
జట్టులో రెండు మార్పులకు అవకాశం 
మధ్యాహ్నం 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

అజేయంగా ఉన్న టీమ్‌ఇండియా అనూహ్యంగా.. ఇంగ్లాండ్‌ చేతిలో ఓడింది..! సెమీస్‌కు అడుగు దూరంలో ఉన్న భారత జట్టు మంగళవారం బంగ్లాదేశ్‌ను ఢీకొనబోతోంది! ఇంగ్లాండ్‌ కంటే పెద్ద జట్టేం కాదు.. కానీ ఆ జట్టు కంటే పెద్ద సవాల్‌ విసరగల సత్తా కలిగిన జట్టు..! తొలి మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికాకు షాకిచ్చి.. వెస్టిండీస్‌ను మట్టికరిపించి సెమీస్‌ రేసులో ఇంకా నేనున్నాంటూ పోరాడుతోంది! మరి ఈ సవాల్‌ను కోహ్లీసేన కాచుకోగలదా..!

ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు గాయాలతో నిష్క్రమిస్తున్న వేళ.. మేం భారం మోయలేమంటూ మిడిలార్డర్‌ నేల చూపులు చూస్తున్న తరుణాన.. సరైన ఆరంభాలు లభించక బ్యాటింగ్‌లో ఒకరిద్దరి మెరుపులపైనే పూర్తిగా ఆధారపడుతున్న టీమ్‌ఇండియా.. బంగ్లాదేశ్‌ను ఓడించి.. సెమీఫైనల్లో అడుగు పెడుతుందా..? నాకౌట్‌కు ముందు మరో మ్యాచ్‌ మాత్రమే ఉన్న నేపధ్యంలో.. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకోవడంతో పాటు.. లోపాల్ని    సరిదిద్దుకుని పక్కాగా  సిద్ధమవడమే ఇప్పుడు టీమ్‌ఇండియా లక్ష్యాలు!

బర్మింగ్‌హామ్‌

ప్రపంచకప్‌లో సమీకరణాలపై ఆధారపడకుండా నేరుగా సెమీఫైనల్‌ బెర్తు సాధించడమే లక్ష్యంగా భారత్‌ కీలక పోరుకు సిద్ధమైంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత్‌ ఢీకొట్టనుంది. ఆదివారం ఇంగ్లాండ్‌తో ఆడిన వేదికలోనే.. అదే పిచ్‌పై బంగ్లాతో టీమ్‌ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 13 పాయింట్లతో కోహ్లీసేన నేరుగా సెమీస్‌కు దూసుకెళ్తుంది. ఇది ఓడితే శ్రీలంకతో చివరి మ్యాచ్‌ కోసం ఎదురు చూడాలి. సెమీస్‌ బెర్తు సాధించడంతో పాటు పట్టికలో ఏ స్థానంలో నిలుస్తారన్నది కూడా కీలకం కావడంతో మిగిలిన రెండు మ్యాచ్‌లూ గెలవాలని టీమ్‌ఇండియా పట్టుదలతో ఉంది. బంగ్లాదేశ్‌కు ఇది చావోరేవో మ్యాచ్‌. సెమీస్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా నెగ్గాలి. చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించాలి. అదే సమయంలో న్యూజిలాండ్‌ చేతిలో ఇంగ్లాండ్‌ ఓడిపోతే బంగ్లాకు సెమీస్‌ బెర్తు ఖాయమవుతుంది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లను అలవోకగా ఓడించిన బంగ్లా.. కీలక మ్యాచ్‌లో భారత్‌కు అంత తేలిగ్గా తలొగ్గుతుందని అనుకోలేం. కాబట్టి మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగొచ్చు.

‘పవర్‌’ లేదు: కొన్నేళ్లుగా బ్యాటింగ్‌లో టాప్‌ఆర్డరే భారత్‌కు ప్రధాన బలం. అయితే ధావన్‌ గాయం ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ప్రణాళికల్ని.. బ్యాటింగ్‌ కూర్పును దెబ్బతీసింది. నాలుగో స్థానంలో రాణించిన కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్‌గా అంచనాల్ని అందుకోలేకపోతున్నాడు. రోహిత్‌ ఆరంభంలో ఎప్పుడూ నెమ్మదిగానే ఆడతాడు. రాహుల్‌.. ధావన్‌ లాగా ధాటిగా ఆడి స్కోరు వేగం పెంచాలి. కానీ అతను నెమ్మదిగా ఆడుతుండటంతో పవర్‌ ప్లేలో ఊపు ఉండట్లేదు. బంగ్లాపై ఓపెనర్ల ఆట మారుతుందేమో చూడాలి. మరోవైపు మిడిలార్డర్‌.. ఆందోళనను అంతకంతకూ పెంచుతోంది. ఇంగ్లాండ్‌పై ఓటమికి వాళ్లదే బాధ్యత. చివర్లో ధోని, జాదవ్‌ల బ్యాటింగ్‌ అనేక ప్రశ్నలకు తావిచ్చింది. బంగ్లాపై ధోని బ్యాటింగ్‌ మారకపోతే కష్టం. పంత్‌ తనపై ఉన్న అంచనాల్ని ఈ మ్యాచ్‌లో అయినా అందుకుంటాడేమో చూడాలి. ధోని తడబడుతున్న నేపథ్యంలో ‘ఫినిషర్‌’ పాత్ర పోషించాల్సింది పాండ్యనే.

ఆ ఓటమి గుర్తుందా?
ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో భారత్‌ మ్యాచ్‌ అనగానే 2007 నాటి పరాభవమే గుర్తుకొస్తుంది. అప్పటికి పసికూన అయిన బంగ్లా.. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమ్‌ఇండియాకు దిమ్మదిరిగే షాకిచ్చి గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది. అయితే ప్రపంచకప్‌లో బంగ్లాతో ఆడిన మిగతా రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ ఘనవిజయం సాధించింది. 2011లో గ్రూప్‌ దశలో ఆ జట్టును చిత్తు చేసిన టీమ్‌ఇండియా.. గత టోర్నీలో క్వార్టర్స్‌లో మట్టికరిపించింది. గతంతో పోలిస్తే మెరుగ్గా ఉన్న బంగ్లాతో అప్రమత్తంగా ఉండాల్సిందే.

విరాట్‌.. సెంచరీ ప్లీజ్‌
ప్రపంచ నం.1 బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి ప్రపంచకప్‌లోనూ అదరగొడుతున్నాడు. భిన్నమైన వికెట్లపై.. మేటి బౌలర్లను ఎదుర్కొంటూ వరుసగా అయిదు అర్ధ శతకాలు (82, 77, 67, 72, 66) సాధించాడు. అయితే ఇప్పటిదాకా 6 మ్యాచ్‌లాడిన కోహ్లి సెంచరీ బాకీ పడ్డాడు. ఆస్ట్రేలియాపై 82 పరుగులతో సెంచరీకి చేరువైనా మూడంకెల స్కోరును అందుకోలేకపోయాడు. చక్కటి లయతో ఆడుతున్న కోహ్లి.. బంగ్లాపై అయినా సెంచరీ కొట్టాలని అభిమానుల ఆకాంక్ష.

ఓడిన పిచ్‌పైనే మళ్లీ
ఆదివారం భారత్‌, ఇంగ్లాండ్‌ ఆడిన పిచ్‌ మీదే మంగళవారం మ్యాచ్‌ జరుగనుంది. ఇది బ్యాటింగ్‌ వికెట్‌. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు భారీ స్కోరు సాధించొచ్చు. మ్యాచ్‌ సమయంలో ఎండ ఉంటుంది. వర్షంపడే అవకాశం లేదు.