కొలువు కోసం వెళ్తే.. కోరిక తీర్చుకున్నాడు!

0
45

గుంటూరు డీఎఫ్‌వోపై ఎస్పీకి మహిళ ఫిర్యాదు

గుంటూరు నేరవార్తలు, గుంటూరు జడ్పీ, న్యూస్‌టుడే: ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.2లక్షల నగదు తీసుకొని, కొన్నిరోజులు తిప్పించుకుని.. బలవంతంగా కోరిక తీర్చుకున్నాడంటూ గుంటూరు జిల్లా అటవీ శాఖాధికారి (డీఎఫ్‌వో) కె.మోహన్‌రావుపై ఓ మహిళ బుధవారం గుంటూరు అర్బన్‌ ఎస్పీ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. డీఎఫ్‌వో తనను మోసగించిన వైనాన్ని ఆమె విలేకరులకు వివరించారు. ‘మాది ప్రకాశం జిల్లా. నేను డీఫార్మసీ చదువుకున్నా. 2009లో వివాహమైనా పలు కారణాలతో విడాకులు తీసుకున్నా. ఎనిమిదేళ్ల పాపతో వృద్ధురాలైన మా అమ్మ దగ్గరే జీవిస్తున్నా. గుంటూరు అటవీశాఖ కార్యాలయంలో ఉద్యోగాలున్నాయని తెలుసుకొని ఫిబ్రవరిలో డీఎఫ్‌వో కె.మోహన్‌రావును పేరేచర్లలోని ఆయన కార్యాలయంలో కలిశాను. నా వివరాలు, సర్టిఫికెట్లు, సెల్‌ నంబరు తీసుకొన్నారు. నాలుగు రోజుల తర్వాత డీఎఫ్‌వో నాకు ఫోన్‌ చేసి ఉద్యోగ విషయం మాట్లాడాలి, తన కార్యాలయానికి రమ్మనడంతో నమ్మి వెళ్లాను. తన కార్యాలయంలో క్లర్కు పోస్టు ఇస్తానని, త్వరలో పర్మినెంట్‌ చేయిస్తానని రూ.4 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అంత ఇచ్చుకోలేననడంతో కనీసం రూ.2 లక్షలు ఇమ్మన్నారు. ఉద్యోగం వస్తే అమ్మ, పాపను పోషించుకోవచ్చని అప్పు చేసి రూ.2 లక్షలు ఫిబ్రవరి 24న ఆయనకు ఇచ్చాను. కొన్ని రోజుల తర్వాత ఉద్యోగం గురించి అడిగితే డబ్బులివ్వగానే ఉద్యోగం రాదని, తన కోరిక తీర్చాలని బలవంతం చేశాడు. నాలుగు నెలలుగా ఆదివారం, సెలవు రోజుల్లో పలుమార్లు తన కార్యాలయానికి పిలిపించుకొని మద్యం తాగుతూ వికృత చేష్టలు చేశాడు’ అని బాధితురాలు వివరించారు. డబ్బులు తీసుకోవడమే కాకుండా.. శారీరకంగా, మానసికంగా వేధించి మోసగించిన అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి, తనకు న్యాయం చేయాలని కోరారు. విచారించి న్యాయం చేస్తామని ఎస్పీ చెప్పారు.
ఆమె ఎవరో తెలియదు: డీఎఫ్‌వో: ఉద్యోగం ఇచ్చేందుకు రూ.2 లక్షలు తీసుకోవటంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధించినట్లు ఓ మహిళ తనపై చేసిన ఆరోపణలను గుంటూరు జిల్లా డీఎఫ్‌వో కె.మోహనరావు బుధవారం ఓ ప్రకటనలో ఖండించారు. ఆమెను ఎప్పుడూ కలవలేదని, అసలు ఆమె ఎవరో కూడా తనకు తెలియదన్నారు. తానంటే గిట్టని కొందరు అటవీ శాఖ ఉద్యోగులు దీనికి కారణమని, వాస్తవాలు విచారణలో తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన మహిళపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు వివరించారు.