రెండు రాష్ట్రాలు.. రెండేసి టీఎంసీలు?

0
64

పరిశీలనలో ఇదొక ప్రతిపాదన
రాష్ట్రాల కమిటీల విడివిడి చర్చలు
రాంపూర్‌ నుంచి 2 జలాశయాలకు మళ్లింపుపైనా కసరత్తు
8 లేదా 9న ఉభయ రాష్ట్రాల కమిటీల భేటీ
 అమరావతి, హైదరాబాద్‌

 

గోదావరి నది నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలకు నీటిని మళ్లించేందుకు సూత్రప్రాయంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించిన నేపథ్యంలో సాగుతున్న తదనంతర కసరత్తు 2 రాష్ట్రాల్లో ఊపందుకుంది. గోదావరి నుంచి కృష్ణాకు నీటిని మళ్లించే వివిధ ప్రతిపాదనలపై బుధవారం 2 రాష్ట్రాల నిపుణులు విడివిడిగా హైదరాబాద్‌లో సమావేశమై చర్చించారు. ఒకేచోట నుంచి కాకుండా 2 రాష్ట్రాల నుంచి రెండేసి టీఎంసీల చొప్పున నీటిని మళ్లించే ప్రతిపాదననూ పరిశీలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ అధికారుల నుంచి ఈ ప్రతిపాదన ఉన్నట్లు ఏపీ అధికారులు పేర్కొన్నారు. 2 టీఎంసీలను తెలంగాణ భూభాగంలోని అనువైన ప్రాంతం నుంచి.. మరో 2 టీఎంసీలను పోలవరం ఎగువ నుంచి మళ్లిస్తే ఎలా ఉంటుందన్న చర్చ సాగుతోంది. అయితే వ్యయ భారం అధికంగా ఉండొచ్చనే అంశమూ పరిశీలనలో ఉంది. హైదరాబాద్‌లోని పోలవరం అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్‌ నిపుణుల కమిటీ సమావేశమైంది. హైడ్రాలజీ చీఫ్‌ ఇంజినీరు రత్నకుమార్‌ ఆధ్వర్యంలో సాగిన ఈ సమావేశంలో చీఫ్‌ ఇంజినీర్లు నారాయణరెడ్డి, సుధాకర్‌బాబులతోపాటు జల వనరుల నిపుణులు రోశయ్య, రౌతు సత్యనారాయణ, సుబ్బారావు, రహ్మాన్‌, ప్రభాకర్‌రెడ్డి  పాల్గొన్నారు. వీరితో పాటు ఇంజినీరింగ్‌ అధికారులు రామచంద్రమూర్తి, హరగోపాల్‌, ఆనంద్‌బాబు తదితరులు హాజరయ్యారు. ఇందులో పోలవరం నుంచి ఎత్తిపోతల, కాలువ… ఆపై పులిచింతల.. అక్కడి నుంచి టెయిల్‌పాండ్‌ నాగార్జున సాగర్‌, శ్రీశైలానికి నదీమార్గం మీదుగా మళ్లించే ప్రతిపాదన సానుకూల, ప్రతికూలాంశాలపై చర్చ సాగింది. ముఖ్యమంత్రి జగన్‌ నేరుగా శ్రీశైలంలోకి మళ్లించాలని సూచించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన ఎంతవరకు సాకారం అవుతుందనే అంశంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం నుంచి 2 టీఎంసీలను సాగర్‌ వరకు మళ్లించడం, తెలంగాణలోని ఏదో ప్రాంతం నుంచి 2 టీఎంసీలను శ్రీశైలానికి మళ్లించడం అనే కోణంలోనూ కొంత పరిశీలన సాగుతోంది.
దుమ్ముగూడెం నుంచి మళ్లింపుపై తెలంగాణ ఇంజినీరింగ్‌ అధికారుల్లో సానుకూలత లేకపోగా… శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు ఒకేచోట నుంచి నీటిని మళ్లించాలనుకుంటే ఇదే ఉత్తమ ప్రతిపాదనగా ఏపీ నీటి పారుదల నిపుణులు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ నీటిని హాలియా వాగు వరకు తీసుకొచ్చి అందులో పోసి టెయిల్‌పాండ్‌కు తీసుకెళ్లవచ్చనే ఆలోచన ఉంది. అక్కడి నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా నాగార్జున సాగర్‌కు మళ్లించాలని భావిస్తున్నారు. హాలియా వాగుకు మరోవైపు నుంచి కాలువ ద్వారా కొంత మళ్లిస్తూ మరికొంత ఎత్తిపోస్తూ శ్రీశైలానికి నీరు తీసుకెళ్లవచ్చని అభిప్రాయపడుతున్నారు. హాలియా నుంచి శ్రీశైలానికి 120 మీటర్ల నుంచి 270 మీటర్ల వరకు ఎత్తిపోయవచ్చని భావిస్తున్నారు.

రాంపూర్‌పై తెలంగాణ అధికారుల కసరత్తు
వరంగల్‌ జిల్లాలోని రాంపూర్‌ నుంచి గోదావరి జలాల తరలింపుపై తెలంగాణ అధికారులు బుధవారం లోతైన పరిశీలన జరిపారు. గోదావరి జలాల తరలింపునకు కంతనపల్లి, రాంపూర్‌, అకినేపల్లి, దుమ్ముగూడెం ప్రాంతాలను అనువైన కేంద్రాలుగా భావించి ఇప్పటికే విస్తృత కసరత్తు చేస్తున్న అధికారులు సాంకేతిక సమాచారం ఆధారంగా లోతుగా పరిశీలించి అన్నింటిలో 65 నుంచి 70 మీటర్ల మట్టంలో ఉన్న రాంపూర్‌ నీటి తరలింపునకు సౌకర్యంగా ఉంటుందన్న ఆలోచనకు వచ్చారు. ఇక్కడ గోదావరి మధ్యలో ఎత్తైన ప్రదేశం (లంక) ఉండటం, ఎగువన విశాలంగా ఉండి దిగువన బ్యారేజీ నిర్మాణానికి అనుకూలత ఉన్నట్లు ట్రోపో పటాల ఆధారంగా ఆలోచించారు. ఇక్కడి నుంచి మొదటి దశలో ఎత్తిపోతల మోటార్లు ఏర్పాటు చేసి నీటిని నల్గొండ జిల్లాలోని 230 మీటర్ల ఎత్తులో ఉన్న ఉదయసముద్రం వరకు తరలిస్తే పని సులువుగా మారుతుందని భావిస్తున్నారు. రెండో దశలో భాగంగా నాగార్జున సాగర్‌కు ఒక మార్గం, శ్రీశైలానికి మరొక మార్గం ఏర్పాటు చేసి నీటిని పంపింగ్‌ చేయడానికి అనుకూలతలు ఉన్నట్లు నిర్ణయించారు. ఉదయసముద్రానికి నీటిని తరలించాక అక్కడి నుంచి నాగార్జున సాగర్‌కు గ్రావిటీ ద్వారా తరలించేందుకు అనుకూలత ఉండటంతో శ్రీశైలంవైపు మళ్లింపు మార్గాలనూ పరిశీలిస్తున్నారు. రాంపూర్‌వద్ద నుంచి ఎత్తిపోయాలంటే బ్యారేజీ నిర్మాణం, ఎత్తిపోతల నిర్మాణాలకు భూసేకరణ జరపాల్సి ఉంటుంది. దాదాపు 25 వేల ఎకరాలకుపైగా భూమి అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు.