ఎంఎస్‌ ధోనీ రిటైర్‌ అవుతాడా? అవ్వడా?

0
101

అతడి బ్యాటు ఏం చెబుతోంది?

ముంబయి: టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాడా? విశ్లేషకులు అవుననే అంటున్నారు. అభిమానులేమో కాదంటున్నారు. ఇంతకీ అసలు ఏం జరగనుందో ఎవరికీ అర్థం కావడం లేదు. మెగాటోర్నీలో ధోనీ ప్రదర్శన మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. స్పిన్‌లో అతడి స్ట్రైక్‌రేట్‌ను సచిన్‌ సహా మాజీలెందరో విమర్శించారు. ఇంగ్లాండ్‌ పోరులో డెత్‌ ఓవర్లలో వేగంగా పరుగులు చేయలేదని సోషల్‌ మీడియాలోనూ విమర్శలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ ఘనమైన కెరీర్‌ను మహీ పేలవంగా ముగించడనే అందరూ భావిస్తున్నారు. ప్రపంచకప్‌ తర్వాత రిటైర్మెంట్‌ గురించి మిస్టర్‌ కూల్‌ కొన్ని సూచనల ద్వారా తెలియజేస్తున్నాడని అనిపిస్తోంది.

ప్రస్తుత ప్రపంచకప్‌లో మ్యాచ్‌లకు ధోనీ వేర్వేరు బ్యాట్లను ఉపయోగిస్తున్నాడు. ఈ విషయాన్ని చాలామంది గమనించడం లేదు. ఈ విధంగా అతడు బ్యాట్‌ తయారీదారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాడట. మహీ తొలుత ఎస్‌జీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత బీఏఎస్‌కు మారాడు. కెరీర్‌ మొదట్లో తనకు స్పాన్సర్‌షిప్‌లు అందించడం ద్వారా ఆదుకున్న బ్రాండ్లకు ఎంఎస్‌ ఈ రూపంలో కృతజ్ఞత ప్రకటిస్తున్నాడని అంటున్నారు. ధోనీ సన్నిహితుడు, మేనేజర్‌ అరుణ్‌ పాండే ఈ విషయాన్ని ధ్రువీకరించారని కొన్ని వార్తలు వస్తున్నాయి.

‘నిజానికి అతడు (ధోనీ) మ్యాచుల్లో విభిన్న బ్రాండ్‌ల వేర్వేరు బ్యాట్లను ఉపయోగిస్తున్నాడు. అందుకు డబ్బులేమీ తీసుకోవడం లేదు. తన కెరీర్‌లో వివిధ దశల్లో మద్దతుగా నిలిచిన వారికి ఈ విధంగా ధన్యవాదాలు చెబుతున్నాడు. మహీకి డబ్బు అవసరం లేదు. అతని వద్ద కావల్సినంత ఉంది. కృతజ్ఞతా పూర్వకంగా ఈ పనిచేస్తున్నాడు. తొలి నుంచీ అతడికి బీఏఎస్‌ అండగా నిలిచింది. ఎస్‌జీ సైతం చాలా సాయం చేసింది’ అని పాండే తెలిపారు. ఇదంతా చూస్తుంటే వీడ్కోలుపై ధోనీ స్పష్టతతో ఉన్నాడని అనిపిస్తోంది.