రోజంతా ఆందోళన.. ఉద్రిక్తత

0
51

పాదయాత్ర హామీ నెరవేర్చాలంటూ సీఎం ఇంటివద్దకు వచ్చిన సాక్షర భారత్‌ సమన్వయకర్తలు, కల్యాణమిత్రలు
బోటుయార్డు వద్ద బైఠాయించిన ఆందోళనకారులు
గ్రామ వాలంటీర్లుగా దరఖాస్తు చేసుకోవాలన్న సీఎం అదనపు కార్యదర్శి
తాడేపల్లి – న్యూస్‌టుడే

ఓ వైపు సాక్షర భారత్‌ సమన్వయకర్తలు.. మరోవైపు కల్యాణమిత్రల ఆందోళనతో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రాంతం గురువారం ఉద్రిక్తంగా మారింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేయాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఉదయం 7 గంటలకే తాడేపల్లి భారతమాత కూడలికి వేర్వేరుగా చేరుకున్న వీరు ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వైపు వెళ్లబోగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళన కొనసాగిస్తుండటంతో మొదట సాక్షర భారత్‌ సమన్వయకర్తల ప్రతినిధులను ముఖ్యమంత్రి నివాసంలోని అర్జీలను స్వీకరించే ఉన్నతాధికారుల వద్దకు అనుమతించారు. అక్కడ నుంచి తిరిగొచ్చిన ప్రతినిధులు అధికారుల నుంచి సానుకూల స్పందన రాలేదని, కనీసం ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని మిగిలిన వారికి చెప్పారు. దీంతో వారంతా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాదయాత్రలో హామీ ఇచ్చారని, ఇప్పుడు వస్తే ముఖ్యమంత్రి కనీసం   కలవనివ్వడం లేదంటూ ఆందోళనకు దిగారు. దీంతో వారికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమ సమస్య పరిష్కారం కానప్పుడు ఆత్మహత్యే శరణ్యమంటూ వారంతా అక్కడ బారికేడ్లను తోసుకుంటూ కృష్ణానదివైపు మూకుమ్మడిగా కదిలారు. మార్గమధ్యంలో డీఎస్పీ రామకృష్ణ తన సిబ్బందితో కలిసి వారిని అడ్డుకున్నారు. వారు అక్కడే బోటుయార్డు వద్ద సుమారు 5 గంటలపాటు బైఠాయించారు. 2009లో ప్రారంభించిన సాక్షర భారత్‌కు సమన్వయకర్తలుగా పని చేస్తున్న తమను తొమ్మిదేళ్లుగా అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకుని 2018 జూన్‌లో మెమో 600ద్వారా అప్పటి తెదేపా ప్రభుత్వం విధుల నుంచి తప్పించిందని సమన్వయకర్తల సంఘం రాష్ట్రాధ్యక్షుడు సిద్దారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 504 మంది మండల కోఆర్డినేటర్లు, దాదాపు 1700మంది గ్రామ పంచాయతీ పరిధిలోని కోఆర్డినేటర్లు ఉపాధిని కోల్పోయారని తెలిపారు. సాయంత్రానికి ప్రతినిధులను ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి వద్దకు తీసుకెళ్లగా గ్రామ వాలంటీర్లుగా దరఖాస్తు చేసుకోవాలని, వారిలో తగిన విద్యార్హత లేని, వయోపరిమితి దాటిన వారుంటే సడలింపునిచ్చి అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పినట్లు ప్రతినిధులు తెలిపారు.

ఎండలో.. వర్షంలోనూ…
ఉదయం ఎండలో, మధ్యాహ్నం, సాయంత్రం వర్షంలోనూ రాత్రి పొద్దుపోయే వరకూ కల్యాణమిత్రలు భారతమాత కూడలి వద్ద ఆందోళన కొనసాగించారు. సీఎం జగన్‌ స్పందించాలంటూ నినాదాలు చేశారు. కల్యాణమిత్రలుగా ఉన్న తమను జగన్‌ ప్రవేశపెట్టే వైఎస్సార్‌ పెళ్లి కానుకలోనూ కొనసాగించాలని కోరారు. ఒక  కల్యాణమిత్ర నమోదు చేస్తే రూ.250 చొప్పున గత ప్రభుత్వం ఇచ్చిందని, ఇప్పుడు నిలుపుదల చేశారని వాపోయారు. తిరిగి వైఎస్సార్‌ పెళ్లికానుకగా పునఃప్రారంభించనున్న పథకంలో తమకు అవకాశం ఇచ్చి గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. సాయంత్రం వరకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం రాకపోవడంతో ఆందోళనను ఉద్ధృతం చేసిన వారంతా బారికేడ్లను తోసుకుని సీఎం ఇంటివైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా వారికి, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

తూర్పు కాపులను బీసీ-ఏ లోకి మార్చాలని వినతి
తూర్పు కాపులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం తూర్పుకాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందిగానీ నిధులు, విధులు లేక నిరర్దకంగా మారిందని తెలిపారు. సంస్థకు నూతన పాలకవర్గాన్ని నియమించాలని తూర్పుకాపు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రమోహన్‌ కోరారు.