నన్ను వెంటాడటమే జగన్‌ ధ్యేయం

0
55

వైకాపా దుశ్చర్యలను ప్రజలు గమనిస్తున్నారు
ఐదేళ్లలో విత్తన సమస్య లేకుండా చూశాం
రైతు సమస్యలపై సోమిరెడ్డి ఆధ్వర్యంలో కమిటీ
నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు

అమరావతి: ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమైన వైకాపా పతనం.. నేను నివసిస్తున్న ఇంటికి నోటీసులివ్వడం, విశాఖ తెదేపా కార్యాలయానికి నోటీసులు పంపడం, గుంటూరు కార్యాలయానికి వస్తున్నందున నోటీసులివ్వడానికి ప్రయత్నించడం వంటి దుశ్చర్యలతో మరింత తీవ్రమయిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. జగన్‌ తనను వెంటాడటమే ధ్యేయంగా పెట్టుకున్నారని ఆరోపించారు. తెదేపా కార్యకర్తలు, పేదలను వేధింపులకు గురిచేసి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే పతనం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో విత్తన సమస్య తలెత్తకుండా చూశామన్నారు. తమ వల్లే ఇప్పుడు రైతులు రోడ్డెక్కారని వైకాపా నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని అన్నదాతలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు గురువారం మీడియాతో మాట్లాడారు. అనంతరం నేతలతో పలు అంశాలపై చర్చించారు. మన కోసం పనిచేసిన కార్యకర్తలకు అండగా నిలబడడం అత్యంత ముఖ్యమని నేతలకు సూచించారు. దాడులు, దౌర్జాన్యాలపై సమాచారం సేకరించి బాధితులకు చట్టపరమైన భద్రత, న్యాయం అందేలా చూడాలని, ఇందుకోసం తెదేపా లీగల్‌ సెల్‌ క్రియాశీలకంగా పని చేయాలని నిర్దేశించారు. కేంద్ర బడ్జెట్‌, ఆర్థిక సర్వేలో అంశాలు, శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో తెదేపా వ్యూహంపై చర్చించారు.

‘తెదేపా అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే విద్యుత్‌ కోతల్లేకుండా చర్యలు తీసుకున్నాం. వైకాపా అధికారంలోకి వచ్చిన నెల తిరక్కుండానే విద్యుత్‌ కోతలు మొదలయ్యాయి. రైతులు పొలాలను వదిలి రోడ్లపైకి వచ్చే పరిస్థితి తలెత్తింది. వైసీపీ నేతలు వాళ్ల గుంత వాళ్లే తవ్వుకుంటున్నారు. వృద్ధిరేటుపై మాట్లాడవద్దని అధికారులకు జగన్‌మోహన్‌రెడ్డి సూచించడాన్ని ఎలా చూడాలి?  సమస్యల పరిష్కారం చేతకాక ప్రతి సమస్యను తెదేపా ప్రభుత్వంపై వేసి తప్పుకోవాలనుకుంటున్నారు. ప్రశాంతంగా ఉన్న కుప్పం నియోజకవర్గంలోనే ఉద్రిక్తతలు తలెత్తే పరిస్థితి తీసుకువచ్చారంటే మిగిలిన నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో అర్ధమవుతోంది. రాష్ట్రంలో రైతులకు సంఘీభావం తెలియజేసి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో తెదేపా తరఫున కమిటీని నియమించాం. విత్తనాలు, సాగునీటి కొరత, విద్యుత్తు కోతలు, కరవు ఉన్న ప్రాంతాల్లో కమిటీ పర్యటిస్తుంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి పరిష్కార మార్గాలపై శాసనసభ వేదికగా చర్చిస్తాం. హైదరాబాద్‌లో ఏపీకి పదేళ్లు హక్కు ఉన్న భవనాలు ఇచ్చేశారు. నీళ్లు ఇచ్చేస్తామంటున్నారు. ఇప్పుడు ఏపీ విత్తనాలు తెలంగాణలో పంపిణీ చేయడంపై ప్రజల్లో ఆగ్రహం నెలకొంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

లోటుపాట్లు దిద్దుకుని ముందుకెళదాం
రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నేతలతో చంద్రబాబు మాట్లాడారు. ప్రతి ఒక్కరు చెప్పేది ఓపిగ్గా విన్నారు. ఎన్నికల్లో ఓడిపోయామంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని కార్యకర్తలు వాపోయారు. మనం చేసిన పనులు జనం గుండెల్లో ఉన్నాయని, ఎవరికీ ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేశామని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమాల్లో నేతలు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, మద్దాళి గిరి, నారా లోకేశ్‌, నారాయణ, అశోక్‌బాబు, బోడె ప్రసాద్‌, వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, అనూరాధ, గల్లా అరుణ, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, దేవినేని అవినాష్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు ప్రకాశం జిల్లాలో పర్యటన
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు శుక్రవారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని ఇంటి వద్ద నుంచి ప్రకాశం జిల్లా పర్యటనకు బయలుదేరుతారు. 10.30 గంటలకు చినగంజాం మండలం రుద్రమాంబపురం గ్రామానికి చేరుకుంటారు. వైకాపా నాయకుల దాడిలో మృతి చెందిన తెదేపా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి గుంటూరు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. ఈ నెల 9న అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. హత్యకు గురైన, ఆత్మహత్యకు పాల్పడిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేస్తారు.