ఇక్కడ బ్యాటింగ్‌.. అక్కడ బౌలింగ్‌!

0
45

ఫోర్త్‌ అంపైర్‌
ప్రపంచకప్‌లో లీగ్‌ దశ ముగిసింది.
హోరాహోరీ పోరాటాలకు తెరపడింది. పాయింట్ల
లెక్కలకు శుభంకార్డు పడింది. ఇక మిగిలినవి నాలుగే జట్లు.
విశ్వపోరుకు ఆఖరి వారం. ప్రపంచకప్‌లో చివరి ఘట్టం.
మంగళవారమే తొలి సెమీస్‌.. గురువారం రెండో సెమీస్‌.. ఆదివారం
మెగా ఫైనల్‌! మరి నాకౌట్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే మైదానాలేవీ? ఏ పిచ్‌
ఎవరికి అనుకూలం? ఏ జట్లు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తే బాగుంటుందో చూద్దాం!

తొలి సెమీస్‌ (మంగళవారం)
భారత్‌ × న్యూజిలాండ్‌
వేదిక: ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌

ఈ ప్రపంచకప్‌లో..
ఈ స్టేడియంలో 4 మ్యాచ్‌లు జరగగా.. నాల్గింట్లోనూ మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లదే విజయం. అందులో 2 టీమ్‌ఇండియా మ్యాచ్‌లే. రెండింట్లోనూ భారత్‌దే పైచేయి.
భారత్‌ 89 పరుగుల ఆధిక్యంతో పాకిస్థాన్‌పై విజయం. రోహిత్‌ (140) సెంచరీతో సత్తాచాటగా.. రాహుల్‌ (57), విరాట్‌ కోహ్లి (77) అర్ధ సెంచరీలతో మెరిశారు. విజయ్‌ శంకర్‌ (2/22), హార్దిక్‌ (2/44), కుల్దీప్‌ (2/32) రెండేసి వికెట్లు తీశారు
ఇంగ్లాండ్‌ 150 పరుగుల ఆధిక్యంతో అఫ్గానిస్థాన్‌పై గెలుపు న్యూజిలాండ్‌ 5 పరుగుల ఆధిక్యంతో వెస్టిండీస్‌పై విజయం. బ్యాటింగ్‌లో కేన్‌ విలియమ్సన్‌ (148), రాస్‌ టేలర్‌ (69).. బౌలింగ్‌లో బౌల్ట్‌ (4/30), ఫెర్గూసన్‌ (3/59) రాణించారు.
భారత్‌ 125 పరుగుల ఆధిక్యంతో విండీస్‌పై గెలుపు. రాహుల్‌ (48), కోహ్లి (72), ధోని (56 నాటౌట్‌), హార్దిక్‌ (46) మెరిశారు. మహ్మద్‌ షమి (4/16), బుమ్రా (2/9), చాహల్‌ (2/39) సత్తా చాటారు.
పరుగులే పరుగులు..
పిచ్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం. బ్యాట్స్‌మెన్‌ క్రీజులో కుదురుకుంటే భారీస్కోరు సాధించొచ్చు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో పిచ్‌పై బంతి ప్రభావం ఉండదు. మధ్యాహ్నం తర్వాత పిచ్‌ మందకొడిగా మారుతుంది. వాతావరణం చల్లబడ్డాక పిచ్‌ నుంచి బౌలర్లకు సహకారం లభిస్తుంది. లక్ష్య ఛేదన కష్టమవుతుంది.
ఇలా చేస్తే…
టాస్‌ గెలిస్తే మొదట బ్యాటింగ్‌ చేయడం సరైన నిర్ణయం. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు రెండు సార్లు 300 పైచిలుకు స్కోర్లు సాధించాయి. ఇంగ్లాండ్‌ దాదాపుగా 400 స్కోరుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఓపెనర్ల పాత్ర కీలకమవుతుంది. 40 ఓవర్ల తర్వాత పరుగులు రాబట్టడం కష్టమవుతుంది. కాబట్టి ఓపెనర్లు చేసే పరుగులే జట్టు స్కోరును నిర్దేశిస్తాయి. మాంచెస్టర్‌లో పాకిస్థాన్‌పై రోహిత్‌ సెంచరీ సాధించాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రోహిత్‌ మరో సెంచరీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. శ్రీలంకతో పోరులో సెంచరీతో జోరుమీదున్న కేఎల్‌ రాహుల్‌ మరో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడితే భారత్‌ ఫైనల్‌ గడప తొక్కొచ్చు. ఇక మాంచెస్టర్‌లో కివీస్‌ 5 పరుగుల ఆధిక్యంతో వెస్టిండీస్‌పై నెగ్గింది. గేల్‌, బ్రాత్‌వైట్‌ వీరవిహారం చేసిన ఈ పిచ్‌పై కివీస్‌ గొప్పగా ఏమీ గెలవలేదు. చివర్లో బ్రాత్‌వైట్‌ తొందరపాటు కివీస్‌కు కలిసొచ్చింది.
5+2+4 
మాంచెస్టర్‌లో టీమ్‌ఇండియాకు 5+2+4 కూర్పుతో ఫలితం ఉండొచ్చు. ఐదుగురు బ్యాట్స్‌మెన్‌.. ఇద్దరు ఆల్‌రౌండర్లు.. నలుగురు బౌలర్లతో ఆడొచ్చు. రోహిత్‌, రాహుల్‌, కోహ్లి, పంత్‌, ధోని, పాండ్య, జడేజా, బుమ్రా, షమి, భువనేశ్వర్‌, కుల్దీప్‌ లేదా చాహల్‌తో బరిలో దిగొచ్చు. బ్యాటింగ్‌ పిచ్‌పై ఐదుగురు బ్యాట్స్‌మెన్‌తో పాటు పాండ్య, జడేజా లాంటి బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్లు అవసరం. చివరి ఓవర్లలో వారి ప్రదర్శనే కీలకమవుతుంది. ఈ కప్‌లో మాంచెస్టర్‌లో జరిగిన 4 మ్యాచ్‌ల్లో పేసర్లే ప్రభావం చూపారు. కాబట్టి బుమ్రా, షమి, భువి, పాండ్యలతో కూడిన కూర్పే అత్యుత్తమం.

 

రెండో సెమీస్‌ (గురువారం)
ఇంగ్లాండ్‌ × ఆస్ట్రేలియా
వేదిక: ఎడ్జ్‌బాస్టన్‌

ఈ ప్రపంచ కప్‌లో..
డ్జ్‌బాస్టన్‌లో 4 మ్యాచ్‌లు నిర్వహించగా.. రెండింట్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు.. రెండింట్లో లక్ష్యాన్ని ఛేదించిన జట్లు నెగ్గాయి. టీమ్‌ఇండియాను ఇంగ్లాండ్‌ ఓడించింది ఇక్కడే.
న్యూజిలాండ్‌ 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం
పాకిస్థాన్‌ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలుపు
ఇంగ్లాండ్‌ 31 పరుగుల ఆధిక్యంతో భారత్‌పై విజయం
టీమ్‌ఇండియా 28 పరుగుల ఆధిక్యంతో బంగ్లాదేశ్‌పై గెలుపు.
పిచ్‌
వర్షాలు పడి.. పిచ్‌ తేమగా ఉన్న సమయంలో వికెట్‌ బౌలర్లకు సహకరించింది. ఎండ బాగా ఉన్నప్పుడు పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించింది. ప్రపంచకప్‌లో జరిగిన 4 మ్యాచ్‌లే ఇందుకు నిదర్శనం. జూన్‌ 19, 26న జరిగిన తొలి 2 మ్యాచ్‌ల్లో లక్ష్య ఛేదన చేసిన జట్లే నెగ్గాయి. 2 మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు 241 పరుగులే. జులై 2, 11న జరిగిన మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లు గెలిచాయి. అప్పుడు వర్షాల ప్రభావం లేదు. రెండు మ్యాచ్‌ల్లో మూడు సార్లు 300 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి.
వ్యూహం
బర్మింగ్‌హామ్‌లో ఒకవైపు బౌండరీ 59 మీటర్లే. భారత్‌తో పోరులో ఇంగ్లాండ్‌ ఈ బౌండరీని బాగా సద్వినియోగం చేసుకుంది. రాయ్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌ అటువైపే ఎక్కువగా పరుగులు రాబట్టారు. టీమ్‌ఇండియా బ్యాటింగ్‌కు వచ్చేసరికి దూరంగా ఉన్న బౌండరీ వైపు ఫీల్డర్లను మోహరించి అటువైపే బంతులు సంధించారు. ఆసీస్‌తో సెమీస్‌లోనూ ఇంగ్లాండ్‌ వ్యూహం అలాగే ఉండొచ్చు.
కూర్పు
బర్మింగ్‌హామ్‌ పిచ్‌పై 6+1+4 కూర్పుతో ఫలితం ఉండొచ్చు. ఆరుగురు బ్యాట్స్‌మెన్‌.. ఒక ఆల్‌రౌండర్‌.. నలుగురు బౌలర్లతో బరిలో దిగొచ్చు. స్పిన్నర్ల ప్రభావం తక్కువే. చాహల్‌ బౌలింగ్‌లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ధారాళంగా పరుగులు పిండుకున్నారు. పేసర్లకు మంచి రికార్డుంది. పేసర్లు స్లో బంతులతో ప్రభావం చూపొచ్చు.

 

ఫైనల్‌ (ఆదివారం)
వేదిక: లార్డ్స్‌

ఈ ప్రపంచ కప్‌లో 
లండన్‌లో 4 మ్యాచ్‌లు జరగగా.. నాల్గింట్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లే నెగ్గాయి.
పాకిస్థాన్‌ 49 పరుగుల ఆధిక్యంతో దక్షిణాఫ్రికాపై  విజయం
ఆస్ట్రేలియా 64 పరుగుల ఆధిక్యంతో ఇంగ్లాండ్‌పై గెలుపు
ఆస్ట్రేలియా 86 పరుగుల ఆధిక్యంతో న్యూజిలాండ్‌పై విజయం
పాకిస్థాన్‌ 94 పరుగుల ఆధిక్యంతో బంగ్లాదేశ్‌పై  గెలుపు
పిచ్‌
బ్యాటింగ్‌, బౌలింగ్‌కు పిచ్‌ సమంగా సహకరిస్తుంది. 4 మ్యాచ్‌ల్లో రెండు సార్లు 300 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. 2 సార్లు 250లోపు.. ఒకసారి 160లోపు స్కోర్లకే పరిమితమయ్యాయి. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 157 పరుగులకే కుప్పకూలింది.  మొత్తంగా ఈ పిచ్‌.. బ్యాటు, బంతి పోరుకు సరైన వేదిక.
వ్యూహం
టాస్‌ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్‌కే మొగ్గు చూపొచ్చు. భారీస్కోరు సాధించి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచొచ్చు. మధ్యాహ్నం తర్వాత వాతావరణం చల్లబడుతుంది కాబట్టి పేసర్లు ప్రభావం చూపిస్తారు.
6+1+4 
6+1+4 కూర్పుతో ఫలితం ఉండొచ్చు. ఆరుగురు బ్యాట్స్‌మెన్‌.. ఒక ఆల్‌రౌండర్‌.. నలుగురు బౌలర్లను తీసుకోవచ్చు. మధ్య ఓవర్లలో స్పిన్నర్‌ పరుగులకు అడ్డుకట్ట వేయొచ్చు.