బుసకొడతాయ్‌..వణికిస్తాయ్‌

0
54

పాములు చేరకుండా ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. చెత్తాచెదారం ఉంటే తొలగించాలి. ఎలుకలు చేరితే వాటిని తినేందుకూ సర్పాలు వస్తుంటాయి.

హైదరాబాద్‌

పాము.. ఈ పేరు విన్నా, కళ్లెదుట కనిపించినా వెన్నులో వణుకు పుడుతుంది. పుట్టలో ఉన్నప్పుడు కొలిచి పాలు పోసేవారే కళ్ల ముందుకు వస్తే భయపడిపోయి అంతమొందించడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం వానాకాలం నేపథ్యంలో భాగ్యనగరంలో పాములు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని ఏమీ చేయకుండా తమకు సమాచారం ఇస్తే చాలు వచ్చి వెంటనే పట్టుకెళతామంటోంది ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీ. సాధారణ రోజుల్లో వీటిని పట్టుకునేందుకు సొసైటికీ 100 వరకు ఫోన్లు వచ్చేవి. ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపయ్యింది.

ఏటా ఈ కాలంలో వరద ముంపునకు తోడు పాముల బెడద ఎక్కువగా ఉంటోంది. కొన్నిసార్లు నీటిలో తేలియాడుతూ వెళుతుంటాయి. ఈ కాలంలోనే సంతానోత్పత్తికి ప్రయత్నిస్తుంటాయి. భాగస్వామిని వెతికేందుకు పుట్ట లేదా రంధ్రాల నుంచి బయటకు వస్తుంటాయి. జెర్రిపోతులు ఈ క్రమంలో 10 లేదా 15 రోజుల వరకు ఎంత దూరమైనా తిరుగుతుంటాయి. అదీగాక వేసవిలో చెరువులు, నీటి వనరులు ఎండిపోవడంతో రంధ్రాల్లో పాములు తలదాచుకుంటాయి. వర్షాలకు నీళ్లు చేరడంతో బయటకు రావడంతోపాటు మరికొన్ని ఆహారం కోసం అన్వేషిస్తాయి. ప్రస్తుతం కప్పలు ఎక్కువగా సంచరించే సమయమైనందున వాటిని పట్టుకుని తినేందుకు బయట కనిపిస్తాయి.
ఈ ప్రాంతాల నుంచి..
పాములు ఉన్నాయంటూ వనస్థలిపురం, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, హయత్‌నగర్‌, అత్తాపూర్‌, సాగర్‌ రింగురోడ్డు, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, లింగంపల్లి, మియాపూర్‌ నుంచి స్నేక్‌ సొసైటీకి అధికంగా ఫోన్లు వస్తున్నాయి. అప్పటివరకు ఖాళీగా ఉన్న స్థలాలన్నీ జనావాసాలుగా మారిపోవడంతో అవి తలదాచుకునే చోటు లేక బహిరంగంగా తిరుగుతున్నాయి. ఇక శివార్లలోని కాలనీల్లో పచ్చిక, మొక్కలు పెరిగి ఉండడంతో అక్కడ ఆవాసంగా చేసుకుంటున్నాయి.

15-20 నిమిషాల్లో వచ్చి పట్టుకుంటాం
– అవినాష్‌, ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీ కార్యదర్శి
పాములు కనిపిస్తే చంపకుండా మా హెల్ప్‌లైన్‌ నంబరుకు ఫోన్‌ చేస్తే వెంటనే వచ్చి పట్టుకుంటాం. మా వాలంటీర్లు దాదాపు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నందున 15-20 నిమిషాల్లోగా ఆ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంటుంది. పట్టుకున్నవాటిని సైనిక్‌పురిలోని సొసైటీ సంరక్షణ కేంద్రానికి తీసుకువస్తాం. గాయపడితే జూకు తరలించి చికిత్స అందిస్తాం. అంతా బాగుంటే అటవీ అధికారులు సూచించిన ప్రాంతాల్లో వదిలివేస్తాం. ఉడుములు, గద్దలు, నెమళ్లు వంటి వన్యప్రాణులు కనిపించినా మాకు తెలియజేయొచ్చు.


భాగ్యనగరంలో ఆ పది ప్రాంతాల్లో అధికం