వైఎస్‌కు జగన్‌ నివాళి

0
79

కుటుంబసభ్యులతో కలిసి ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు

కడప: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ఇడుపులపాయలోని  వైఎస్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం జగన్‌ ఇడుపులపాయలో పర్యటించనున్నారు. గండి ఆంజేనేయస్వామిని దర్శించుకొని ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు.

అక్కడి నుంచి జమ్మలమడుగులో నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్‌ పెరిగిన పింఛను పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 12 రకాల పింఛన్లను లబ్ధిదారులకు ప్రతి నెలా పంపిణీ చేస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, డయాలసిస్‌ రోగులు, ఎయిడ్స్‌ బాధితులు, దివ్యాంగులకు పింఛన్లు ఇస్తోంది. అవ్వాతాతల పింఛనును రూ.3 వేల వరకు పెంచుతూ పోతామన్న సీఎం జగన్‌ ఎన్నికల హామీ నేపథ్యంలో మొదటి విడతగా రూ.2,250కు పెంచారు. గత ప్రభుత్వం 40 నుంచి 79 శాతం వైకల్యం ఉన్న వారికి ప్రతి నెలా రూ.2 వేలు, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి రూ.3 వేల చొప్పున సాయం ఇచ్చేది. కొత్త ప్రభుత్వం ఈ తేడాలేమీ లేకుండా దివ్యాంగులందరికీ రూ.3 వేల చొప్పున అందించనుంది. ఈ నిర్ణయంతో 3,89,094 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది.