పిచ్‌తో సంబంధం లేదు: విరాట్‌కోహ్లీ
మాంచెస్టర్: న్యూజిలాండ్‌తో తలపడే సమీఫైనల్స్‌లో ఒత్తిడే కీలకంగా మారుతుందని, దాన్ని జయించిన జట్టే విజయం సాధిస్తుందని టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ పేర్కొన్నాడు. కివీస్‌తో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ పిచ్‌తో సంబంధం లేకుండా పరిస్థితులకు తగ్గట్టు ఆడటమే ముఖ్యమని చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చాలా ఒత్తిడి ఉంటుందని, ఆ సమయంలో ఏవైనా రెండు తప్పులు చేస్తే మ్యాచ్ ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లిపోతుందని అన్నాడు. మళ్లీ దాన్ని మనవైపు తిప్పుకోవాలంటే చాలా కష్టమని..ఎన్నో ఛేదనలు చూసిన తాను ఈ విషయాన్ని గ్రహించినట్లు కోహ్లీ పేర్కొన్నాడు.
ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీల్లో ఒత్తిడి మరింత ఉంటుందనీ.. అలాగే తప్పులు చేసే అవకాశం కూడా ఎక్కువేనని పేర్కొన్నాడు. దాన్ని ప్రత్యర్థులు సద్వినియోగం చేసుకుంటారని తెలిపాడు. ‘టాస్ విషయానికి వస్తే అది మన చేతుల్లో లేదు, దాని గురించి పెద్దగా చింతించాల్సిన పనిలేదు. కాబట్టి ఆ విషయాన్ని పట్టించుకోవద్దు. ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం టీమిండియా అలాగే ఆడుతుంది. టాస్ ఓడిపోయినంత మాత్రాన వెనుకపడినట్లు కాదు, మన మీద మనకు నమ్మకం ఉండి, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’ అని కోహ్లీ తెలిపాడు.