దిల్లీ: సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘కోన’ను హ్యుందాయ్ సంస్థ విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.25.30 లక్షలుగా నిర్ణయించారు. భారత్‌లో మొట్టమొదటి ఎస్‌యూవీగా ‘కోన’ రికార్డు సృష్టించింది. ఇంటీరియర్, ఫీచర్లు, కారు లోపల విశాలమైన స్థలం విషయంలో క్రెటాను పోలి ఉంటుంది. కారు ముందు భాగంలో పగలు కూడా వెలిగే ఎల్‌ఈడీ బల్బ్‌లను అమర్చారు. ఈ డిజైన్ విభిన్నంగా ఉంది. ఈ కారు బంపర్‌కు హ్యుందాయ్ కాస్కేడింగ్ డిజైన్ గ్రిల్‌ను అమర్చింది.
ప్రపంచ వ్యాప్తంగా కోన ఎలక్ట్రిక్ రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తోంది. 39.2 కిలోవాట్లు, 64 కిలోవాట్లతో పనిచేస్తాయి. ప్రస్తుతం దీనికి అమర్చిన బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 452 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది 80శాతం ఛార్జింగ్ అయ్యేందుకు గంట సమయం చాలు. ఈ కారు కొనుగోలు చేసే ప్రయాణికులకు ఒక పోర్టబుల్ ఛార్జర్, ఏసీ వాల్ బాక్స్ ఛార్జర్లు ఇస్తారు. పోర్టబుల్ ఛార్జర్‌ని త్రీ పిన్ 15 యాంపియర్స్ సాకెట్‌లో పెట్టి మూడు గంటలు టాప్ అప్ ఛార్జింగ్ చేసుకొని 50 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 7.2కిలోవాట్ల బాక్స్ ఛార్జర్ ద్వారా గంట టాప్ అప్ ఛార్జింగ్ చేసుకొని 50 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
ఒకసారి ఛార్జ్ చేస్తే 557కి.మీ.
‘కోన’లో 100 కిలో వాట్ల మోటార్ అమర్చారు. ఇది ముందు చక్రాలకు 395 ఎన్‌ఎం టార్క్ వద్ద 131బీహెచ్‌పీ శక్తిని అందిస్తుంది. ఇది ఏకధాటికి 345 కి.మీ. ప్రయాణిస్తుంది. కోన మరో మోడల్ 150 కిలోవాట్ల మోటార్‌ను అమర్చారు. ఇది 395ఎన్‌ఎం టార్క్ వద్ద 200 బీహెచ్‌పీ శక్తిని అందిస్తుంది. ఏకధాటిగా 557 కి.మీ. ప్రయాణిస్తుంది. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 9.7 క్షణాల్లోనే అందుకుంటుంది. ఒక సాధారణ ఎస్‌యూవీ కంటే ఇది చాలా ఎక్కువ వేగం. ఈ కారు మొత్తం ఎకో, కంఫర్ట్, స్పోర్ట్ అనే డ్రైవింగ్ మోడ్స్‌లో లభిస్తుంది.
వైర్‌లెస్ ఛార్జింగ్
కారులోపల 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను అమర్చారు. దీనికి స్మార్ట్‌ఫోన్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. ఈ కారులో యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ ఆప్షన్లను ఇచ్చారు. వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్స్, హెడ్‌అప్ డిస్‌ప్లే ఉన్నాయి. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, బై ఫంక్షన్ ఎల్‌ఈడీ ల్యాంప్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రమెంట్ కన్సోల్, 10రకాలుగా డ్రైవర్‌సీట్‌ను మార్చుకునే ఆప్షన్‌ను అందుబాటులో ఉంచారు. ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్‌సీ, వీఎస్‌ఎం, హెచ్‌ఏసీ, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్, వర్చువల్ ఇంజిన్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.
ఛార్జింగ్ వ్యవస్థలు ఇలా..
ఈ కారు కోసం ఛార్జింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసే పనిలో హ్యుందాయ్ నిమగ్నమైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో ముంబయి, చెన్నై, బెంగళూరు, దిల్లీలో ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. గంటలో 80శాతం ఛార్జింగ్ అయ్యేలా చేసే పరికరాలను అమర్చడానికి హ్యుందాయ్ పెట్టుబడులు పెట్టనుంది.