తుగ్లక్‌లా జగన్‌ పరిపాలన

0
79

పోలవరం జాప్యానికి మీ తండ్రే కారణం
తెదేపా నాయకుల ధ్వజం

విత్తనాలడిగితే లాఠీలతో కొడతారా?

రైతులకు విత్తనాలను అందించలేని వైకాపా ప్రభుత్వం రైతు దినోత్సవం జరపడం హాస్యాస్పదమని తెదేపా నాయకులు ధ్వజమెత్తారు. ‘విత్తనాలడిగితే లాఠీలతోÈ కొడుతున్నారు. పోలీస్‌స్టేషన్లలో విత్తనాలను సరఫరా చేస్తున్నారు. పొలాల్లో ఉండాల్సిన రైతుల్ని రోడ్డెక్కించారు. విత్తనాల తయారీ అంటే ఇడ్లీ, ఉప్మా చేసినట్లు కాదని వ్యవసాయశాఖ మంత్రే వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం రైతులపట్ల వారి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం’ అని మండిపడ్డారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సోమవారం గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, అధికార ప్రతినిధులతో సమావేశమయ్యారు. జగన్‌ పరిపాలన తుగ్లక్‌ పాలనలా ఉందని తెదేపా నేతలు విమర్శించారు. ‘వైఎస్‌ హయాంలో టెండర్లను ప్రిక్లోజర్‌ చేయడంవల్లే పోలవరం ప్రాజెక్టులో జాప్యం జరిగింది. అప్పుడే పనులను వేగంగా చేసి ఉంటే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది. నాలుగేళ్లలో 70శాతం పనులను పూర్తి చేసిన మమ్మల్ని ఎలా విమర్శిస్తారు? పోలవరం ప్రాజెక్టులో ఎక్కడ అవినీతి జరిగిందో వెతకాలని అధికారుల్ని బతిమాలుతున్నారు. అవార్డులు, రివార్డులు ఇస్తామంటున్నారు. అంటే ఇన్నాళ్లూ మీరు మాపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే కదా?’ అని పేర్కొన్నారు. ‘మీరు కోట్లు ఖర్చు పెట్టి ఇళ్లు కట్టుకోవచ్చు. మీ టాయిలెట్లకు రూ.30 లక్షలు ఖర్చు పెడతారు. పేదవాడి ఇంట్లో మాత్రం టాయిలెట్‌ ఉండకూడదా? నాణ్యమైన సింక్‌, టైల్స్‌తో చక్కటి ఇల్లు కడితే దానిపై అవినీతి బురద చల్లుతారా?’ అని ధ్వజమెత్తారు. ‘మీరు చెప్పిన రాజన్న రాజ్యంలోనే 14 లక్షల ఇళ్లు మాయమయ్యాయి. రూ.5వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. మీ నాయన కట్టిన ఇళ్లు పిచ్చుక గూళ్లని, మంచం కూడా పట్టదని అనేవారు గుర్తుందా? ఏ ఇళ్లు బాగున్నాయో వెళ్లి చూసొద్దామా?’ అని ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి తెదేపా నాయకులు వ్యాఖ్యానించారు. ‘పింఛనును     రూ.3వేలు చేస్తానని చెప్పి కేవలం రూ.250 మాత్రమే పెంచి వృద్ధులు, దివ్యాంగులు, అనాథ మహిళల్ని మోసం చేశారు. పింఛను రూ.వెయ్యి నుంచి రూ.2,250కి పెంచానని చెప్పడం జగన్‌మోహన్‌రెడ్డి వక్రబుద్ధికి నిదర్శనం. పింఛను రూ.2వేలు చేసింది చంద్రబాబునాయుడే అన్నది అందరికీ తెలిసిన సత్యం’ అని పేర్కొన్నారు. ‘బీమా క్లెయింలను నిలిపేశారు. సీఎంఆర్‌ఎఫ్‌ చెల్లింపులను ఆపేశారు. పెళ్లి కానుకలు, రంజాన్‌ కానుకలను నిలిపేశారు. ఇది నిలిపివేతల ప్రభుత్వమే తప్ప చెల్లింపుల ప్రభుత్వం కాదనేది 40 రోజుల్లోనే తేలిపోయింది’ అని తెదేపా నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు,   దేవినేని ఉమామహేశ్వరరావు, జవహర్‌, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

వైకాపా దుందుడుకు చర్యలను అడ్డుకుంటాం
వైకాపా దుందుడుకు చర్యలను అడ్డుకుంటామని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కార్యకర్తలతోపాటు తెలంగాణలోని అదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వందలాది మంది కార్యకర్తలు, మహిళలు సోమవారం గుంటూరులోని పార్టీ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. కంభంపాడులో వైకాపా కార్యకర్తలు దాడులకు పాల్పడుతుంటే తెదేపా కార్యకర్తలు ఊరు వదిలి వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు స్పందిస్తూ… వైకాపా దుష్ట పాలనపట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఎవరూ భయపడొద్దని, పూర్తి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కార్యకర్తలు మాట్లాడుతూ నాయకులు వెళ్లినా కార్యకర్తలందరం పార్టీ వెన్నంటి ఉన్నామని చెప్పారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలందరికీ న్యాయం జరిగే విధంగా అండగా ఉంటానని చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు.

తెదేపాను వీడే ప్రసక్తే లేదు: ప్రత్తిపాటి
కొందరు తెదేపా నేతలు భాజపాలో చేరుతున్నారంటూ అసత్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న తెదేపాను ఖాళీ చేయడం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. తాను తెదేపాను వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండీ జగన్‌ పచ్చి అబద్ధాలాడుతున్నారని విమర్శించారు.

కిషన్‌రెడ్డిని మర్యాదకే కలిశా: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
అమరావతి: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని తాను మర్యాదపూర్వకంగానే విజయవాడలో కలిశానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. ‘నేను ఎప్పటికీ చంద్రబాబుకు, తెదేపాకు విధేయుడినే’ అని వంశీ తెలిపారు.