ప్రపంచకప్‌ తొలి సెమీఫైనల్‌ నేడే

0
93

ఫేవరెట్‌ కోహ్లీసేనే.. కివీస్‌తో తేలికేం కాదు
న్యూజిలాండ్‌తో భారత్‌ అమీతుమీ
మధ్యాహ్నం 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
మాంచెస్టర్‌

 మొన్న ప్రపంచకప్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడుతుంటే.. అర్ధరాత్రి దాటాక కూడా భారత అభిమానులంతా ఆసక్తిగా మ్యాచ్‌ చూశారు. సఫారీ జట్టు గెలుపు బాటలో సాగుతుంటే సంతోషించారు. ఆస్ట్రేలియా పోటీలోకి వస్తే కంగారు పడ్డారు. చివరికి దక్షిణాఫ్రికానే గెలిస్తే హమ్మయ్య అనుకున్నారు.
ఆడిన 8 మ్యాచ్‌ల్లో సాధించిన విజయాలు అయిదు.. ఆ విజయాలు కూడా తన కంటే బలహీనమైన జట్లపై సాధించినవి.. అదృష్టం కలిసొచ్చి కష్టం మీద సెమీస్‌ చేరింది.. కెప్టెన్‌ను మినహాయిస్తే బ్యాటింగ్‌ బలహీనం.. టీమ్‌ఇండియాతో ముఖాముఖిలో వెనుకంజే..  చివరగా మన జట్టుతో జరిగిన సిరీస్‌లో చిత్తుగా ఓడింది. అన్నిటికీ మించి ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌లో పేలవ రికార్డు.. ఇదీ ప్రత్యర్థి పరిస్థితి!
అందుకే అభిమానులంతా న్యూజిలాండే మన సెమీస్‌ ప్రత్యర్థి కావాలని ఆశించారు. ఆశలు ఫలించాయి. కోరుకున్న జట్టుతోనే సెమీస్‌. కొన్నేళ్ల ఫామ్‌, టోర్నీలో ప్రదర్శన, బలాబలాలు.. ఇలా ఏ కోణంలో చూసినా ఒక మెట్టు పైనే ఉన్న కోహ్లీసేన, కివీస్‌ను కొట్టి ఫైనల్లో అడుగు పెట్టడం లాంఛనమే కావాలి!
కానీ ప్రత్యర్థిని తేలిగ్గా అంచనా వేస్తే ఏమవుతుందో టోర్నీలో భారత్‌కు మహ బాగా అనుభవమే. తనదైన రోజు అఫ్గానిస్థాన్‌ సైతం టీమ్‌ఇండియాను భయపెట్టింది. కాబట్టి ఎంతమాత్రం  ఉదాసీనత దరిచేరనివ్వకుండా, పూర్తి సామర్థ్యం మేరకు ఆడటమే కోహ్లీసేనకు సవాల్‌! ఈ సవాల్‌ను ఛేదిస్తే మనకు, కప్‌కు మధ్య మిగిలేది ఒక్క అడుగే!

 

మనకు మిడిలార్డర్‌.. వాళ్లకు ఓపెనర్లు!

బౌలింగ్‌లో భారత్‌, కివీస్‌ బలాబలాలు దాదాపు సమానం! బ్యాటింగ్‌లో మాత్రం భారత్‌ది స్పష్టమైన పైచేయి. టాప్‌ఆర్డరే భారత్‌కు అతి పెద్ద బలం. రోహిత్‌ కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. అతడి భాగస్వామి రాహుల్‌ మ్యాచ్‌ మ్యాచ్‌కూ మెరుగవుతున్నాడు. కోహ్లి సెంచరీ కొట్టలేదన్న మాటే కానీ మంచి లయతో ఉన్నాడు. ఈ ముగ్గురిలో ఇద్దరాడితే భారత్‌కు తిరుగుండదు. అయితే బ్యాటింగ్‌లో భారత్‌ ఆందోళనంతా మిడిలార్డర్‌ గురించే. ఇప్పటిదాకా ఏ మ్యాచ్‌లోనూ ‘మిడిల్‌’ సాధికారతతో ఆడలేదు. ధోని ఇక ఆడేది ఒకటో రెండో మ్యాచ్‌లు. వాటిలో తనదైన ముద్ర వేసి కెరీర్‌ను ముగించాలన్నది అభిమానుల ఆకాంక్ష. పంత్‌, పాండ్య మంచి లయతోనే కనిపిస్తున్నా.. వారి నుంచి జట్టు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది. లీగ్‌ దశలో చెల్లిపోయింది కానీ.. నాకౌట్‌లో టాప్‌ఆర్డర్‌ విఫలమైతే మిడిలార్డర్‌ ఏమేరకు జట్టును నిలబెడుతుందన్నది ప్రశ్న. భారత్‌ను మిడిలార్డర్‌ ఎలా తలనొప్పిగా మారిందో.. కివీస్‌ను ఓపెనర్ల వైఫల్యం అలా వేధిస్తోంది. గప్తిల్‌ (8 మ్యాచ్‌ల్లో 166 పరుగులు), మన్రో (125) పేలవ ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పటిదాకా వీళ్లిద్దరిలో ఒక్కరూ పెద్ద ఇన్నింగ్స్‌ ఆడలేదు. దీంతో విలియమ్సన్‌పై చాలా భారం పడుతోంది. సెమీస్‌లో అయినా వీరు చెలరేగాలని కివీస్‌ కోరుకుంటోంది.

అతణ్ని పడగొట్టాలి.. ఇతణ్ని అడ్డుకోవాలి…

స్ఫూర్తిమంతమైన కెప్టెనే ప్రత్యర్థికి అతి పెద్ద బలం. గ్రూప్‌ దశలో కివీస్‌ విజయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన విలియమ్సన్‌కు కళ్లెం వేస్తే కివీస్‌ అవకాశాల్ని దెబ్బ తీసినట్లే. ఓపెనర్లు ఘోరంగా విఫలమవుతున్నప్పటికీ.. వికెట్‌ పడగానే క్రీజులోకి వచ్చి మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌తో భాగస్వామ్యాలు నెలకొల్పడం ద్వారా జట్టును నిలబెడుతూ వచ్చాడు కేన్‌. మధ్య ఓవర్ల వరకు కేన్‌ను ఉండనిస్తే భారీ ఇన్నింగ్స్‌ ఆడేస్తాడు. ఇక ఫామ్‌లో లేని ఓపెనర్లు గప్తిల్‌, మన్రోలను బుమ్రా, షమి ఆరంభంలో ఒత్తిడికి గురి చేస్తే వికెట్లు వచ్చేస్తాయి. కివీస్‌ మిడిలార్డర్‌ కూడా ఏమంత మంచి ఫామ్‌లో లేదు కానీ.. ఆ జట్టుకు లోతైన బ్యాటింగ్‌ బలం ఉండటం కలిసొచ్చే అంశం. లోయర్‌ మిడిలార్డర్లో నీషమ్‌, గ్రాండ్‌హోమ్‌, శాంట్నర్‌ లాంటి ప్రమాదకారులున్నారు. ఇక కివీస్‌ బౌలింగ్‌లో బౌల్ట్‌ అందరికంటే ప్రమాదకారి. వేగం, కచ్చితత్వం ఉండే బౌల్ట్‌ బౌలింగ్‌ను ఆడటం అంత సులువు కాదు. తొలి స్పెల్‌లో అతడిని జాగ్రత్తగా ఆడుకోవాలి. ఇక పెద్దగా అంచనాల్లేకుండా టోర్నీలోకి వచ్చిన ఫెర్గూసన్‌.. బౌల్ట్‌ (15 వికెట్లు) కన్నా ఎక్కువగా 17 వికెట్లు పడగొట్టాడు. హెన్రీ కూడా కివీస్‌ బౌలింగ్‌ బలాన్ని పెంచేవాడే. ఐపీఎల్‌లో భారత బ్యాట్స్‌మన్‌ ఆట తీరును బాగా చదివేసిన స్పిన్నర్‌ శాంట్నర్‌తో మధ్య ఓవర్లలో    జాగ్రత్తగా ఉండాల్సిందే.

కోహ్లి × విలియమ్సన్‌

కరిలో దూకుడు ఎక్కువ. మరొకరికి ఓపిక అధికం. కాకపోతే ఇద్దరి దాహం ఒక్కటే.. పరుగులు! ఆ ఇద్దరే విరాట్‌ కోహ్లి.. కేన్‌ విలియమ్సన్‌. ఆటతీరు, శైలి ప్రకారం భిన్న ధ్రువాలైన కోహ్లి, కేన్‌లే తొలి సెమీస్‌లో ఇరుజట్లకు అత్యంత కీలకం. కోహ్లి బ్యాటింగ్‌ నైపుణ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వన్డే చరిత్రలోనే అతను అత్యంత గొప్ప బ్యాట్స్‌మన్‌గా ఇప్పటికే పేరు సంపాదించాడు. ఏ బ్యాట్స్‌మెన్‌కూ లేని విధంగా ఛేదనలో ఘనమైన రికార్డుండటం అతడి ప్రత్యేకత. ప్రస్తుత టోర్నీలో కోహ్లి ఇప్పటికే 63.14 సగటుతో 442 పరుగులు రాబట్టాడు. 5 అర్ధ సెంచరీలు చేశాడు. ప్రపంచకప్‌లో సెంచరీ లోటును సెమీస్‌లో తీరుస్తాడేమో చూడాలి. ఇక విలియమ్సన్‌ది కోహ్లికి పూర్తిగా భిన్నమైన శైలి. అతను నెమ్మదస్తుడు. కివీస్‌ బ్యాటింగ్‌కు వెన్నుముక అతడే. 2015 ప్రపంచకప్‌ నుంచి ఇప్పటిదాకా  విలియమ్సన్‌ 71 వన్డేలాడాడు. అందులో 44 సార్లు తొలి ఐదు ఓవర్లలోనే బ్యాటింగ్‌కు రావడం గమనార్హం. కివీస్‌ ఓపెనింగ్‌ జోడీ బలంగా లేకపోయినా వన్‌డౌన్‌లో కేన్‌ పెట్టని గోడ. ప్రపంచకప్‌లోనూ అది మరోసారి రుజువైంది.  పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం.. పిచ్‌ను వేగంగా చదవడం విలియమ్సన్‌ ప్రత్యేకత. ఎలాంటి షాట్లు ఆడాలి.. ఏ బౌలర్‌ను లక్ష్యం చేసుకోవాలని అప్పటికప్పుడు నిర్ణయించుకుని ఆడతాడు. తెలివిగా బ్యాటింగ్‌ చేస్తూ భాగస్వామ్యాలు అల్లుతాడు. 150 ఆటగాళ్లు బరిలో దిగిన ఈకప్‌లో అత్యధిక సగటు కేన్‌ (96.2)దే కావడం విశేషం.

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌, రాహుల్‌, కోహ్లి, పంత్‌, ధోని, పాండ్య, కుల్‌దీప్‌, చాహల్‌, జడేజా/భువనేశ్వర్‌, బుమ్రా, షమి
న్యూజిలాండ్‌:గప్తిల్‌, మన్రో, విలియమ్సన్‌, టేలర్‌, లేథమ్‌, నీషమ్‌, గ్రాండ్‌హోమ్‌, శాంట్నర్‌, హెన్రీ, బౌల్ట్‌, ఫెర్గూసన్‌

వర్షం వస్తే..?

ప్రపంచకప్‌లో సెమీస్‌, ఫైనల్‌కు రిజర్వ్‌డేలు ఉన్నాయి. వర్షం వల్ల తొలి రోజు మ్యాచ్‌ జరగకపోయినా, పూర్తి కాకపోయినా.. తర్వాతి రోజు ఆడిస్తారు. అప్పటికీ ఫలితం తేలకపోతే గ్రూప్‌ దశలో ఎక్కువ పాయింట్లున్న జట్టు ముందంజ వేస్తుంది. ఈ లెక్కన కివీస్‌తో సెమీస్‌ (11 పాయింట్లు) జరగకపోతే భారతే (15 పాయింట్లు) ఫైనల్‌ చేరుతుంది. మాంచెస్టర్‌లో సోమవారం జల్లులు పడ్డాయి. మ్యాచ్‌ రోజు కూడా వర్షం పడొచ్చు. రిజర్వ్‌ డే అయిన బుధవారం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మంగళవారం ఆట సాగకుంటే ఫలితం తేలడం కష్టమే. ఒకవేళ మ్యాచ్‌ టై అయితే సూపర్‌ ఓవర్‌ ఆడిస్తారు.

 పిచ్‌

ల్డ్‌ట్రాఫోర్డ్‌ పిచ్‌ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలం. టోర్నీలో ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ గెలిచింది. పాక్‌పై ఇక్కడే భారత్‌ 336 పరుగుల భారీ స్కోరు సాధించింది. మూడు రోజుల కిందట ఇక్కడ ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో 640 పరుగులు నమోదయ్యాయి. అయితే మబ్బులు కమ్మిన వాతావరణంలో ఇక్కడ బ్యాటింగ్‌ కష్టమని భారత్‌, వెస్టిండీస్‌ మ్యాచ్‌లో రుజువైంది. ఆ మ్యాచ్‌లో భారత్‌ 268 పరుగులే చేయగా.. విండీస్‌ దాదాపు సగం స్కోరుకే ఆలౌటైంది. సెమీఫైనల్‌ సందర్భంగా పిచ్‌ కొంచెం నెమ్మదిగానే ఉండి ఓ మోస్తరు స్కోర్లే నమోదవచ్చు. పేసర్లు,  స్పిన్నర్లకు పిచ్‌ సమానంగా సహకరించొచ్చు.

టాస్‌ గెలిస్తే  గెలిచినట్లే

టాస్‌ గెలిస్తే సగం మ్యాచ్‌ గెలిచినట్లే. గ్రూప్‌ దశలో ఫలితాల్ని బట్టి చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.  మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లే మెజారిటీ విజయాలందుకున్నాయి. లీగ్‌ దశలో 41 మ్యాచ్‌లు (4 రద్దయ్యాయి) జరగ్గా.. అందులో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లే 27 నెగ్గాయి. ఛేదనలో వచ్చిన విజయాలు 14 మాత్రమే. మ్యాచ్‌ వేదిక ఓల్డ్‌ట్రాఫోర్డ్‌లో ఐదు మ్యాచ్‌లు జరగ్గా మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టే అన్నింట్లో గెలిచింది. టోర్నీలో 250కి పైగా లక్ష్యాల ఛేదన రెండుసార్లే జరిగింది. కాబట్టి వాతావరణం మరీ మబ్బులు కమ్మి ఉంటే తప్ప సెమీస్‌లో టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశాలే ఎక్కువ.

ముగ్గురు స్పిన్నర్లు

పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్న నేపథ్యంలో జడేజాతో కలిపి ముగ్గురు స్పిన్నర్లను భారత్‌ ఆడించే అవకాశముంది. కార్తీక్‌ స్థానంలో చాహల్‌ జట్టులోకి రావచ్చు. భువనేశ్వర్‌ బదులు షమిని ఎంచుకునే అవకాశాలే ఎక్కువ.

17

బుమ్రా వికెట్లు. భారత జట్టులో అత్యధిక వికెట్ల వీరుడు అతనే. న్యూజిలాండ్‌ జట్టులో ఫెర్గూసన్‌ కూడా 17 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 

రెండు జట్ల మధ్య లీగ్‌ మ్యాచ్‌ వర్షం వల్ల రద్దయింది
న్యూజిలాండ్‌తో చివరి పది వన్డేల్లో భారత్‌ 7 నెగ్గింది. రెండు కివీస్‌ గెలిచింది. ఒక మ్యాచ్‌ రద్దయింది. చివరగా కివీస్‌తో దాని సొంతగడ్డపై  జరిగిన వన్డే సిరీస్‌లో భారత్‌ 4-1తో గెలిచింది.
647

ఈ ప్రపంచకప్‌లో రోహిత్‌ పరుగులు. సగటు 92.42. అతను 5 సెంచరీలు చేశాడు. రోహితే టోర్నీ టాప్‌స్కోరర్‌. విలియమ్సన్‌ 96.2 సగటుతో 481 పరుగులు చేసి కివీస్‌ టాప్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.